Share News

PM Modi: నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది

ABN , Publish Date - Jun 26 , 2025 | 06:00 AM

అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు.

PM Modi: నాడు రాజ్యాంగ స్ఫూర్తి ధ్వంసమైంది

  • దేశ చరిత్రలో ఎమర్జెన్సీ కాలం ఒక చీకటి అధ్యాయం

  • ప్రాథమిక హక్కులను కాలరాశారు

  • పత్రికా స్వేచ్ఛను హరించారు

  • నేతలు, విద్యార్థుల్ని జైళ్లలో తొక్కారు

  • నాకు అదో అనుభవపూర్వక అభ్యసనం: ప్రధాని మోదీ

  • ఎమర్జెన్సీ నాటి స్వీయ అనుభవాల సంకలన పుస్తకం ఆవిష్కరణ

న్యూఢిల్లీ, జూన్‌ 25: అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి) విధించి రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలను పక్కకుపెట్టిందని.. పౌరుల ప్రాథమిక హక్కులను సస్పెండ్‌ చేసిందని.. పత్రికా స్వేచ్ఛను హరించిందని, భారీ సంఖ్యలో రాజకీయ నేతలు, ప్రముఖులు, విద్యార్థులు, పౌరులను జైళ్లలో తొక్కిందని విమర్శించారు. అసలు ప్రజాస్వామ్యాన్నే సస్పెండ్‌ చేసిందన్నారు. దీనిని ఏ భారతీయుడూ విస్మరించడని స్పష్టంచేశారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ కాలంలో స్వీయ అనుభవాలను, ప్రజాస్వామ్య హక్కుల కోసం చేసిన పోరాట సంఘటనలను సంకలనం చేస్తూ ప్రచురించిన ‘ది ఎమర్జెన్సీ డైరీ్‌స-ది ఇయర్స్‌ దట్‌ ఫోర్జ్‌డ్‌ ది లీడర్‌’ అనే పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. దీనిని బ్లూక్రాఫ్ట్‌ డిజిటల్‌ ఫౌండేషన్‌ సంస్థ ప్రచురించింది. ఈ సందర్భంగా ప్రధాని ‘ఎక్స్‌’లో వరుస పోస్టులు పెట్టారు. ఎమర్జెన్సీ తనకు అనుభవపూర్వక అభ్యసనమని.. ప్రజాస్వామ్య ఫ్రేమ్‌వర్క్‌ పరిరక్షణ ఎంత కీలకమో తెలియజెప్పిందన్నారు. ‘ఈ పుస్తకం ఎమర్జెన్సీ రోజుల్లో నా ప్రయాణాన్ని కాలానుగుణమైన సంఘటనలను వివరిస్తుంది. మాజీ ప్రధాని దేవెగౌడ దీనికి ముందుమాట రాశారు.


ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట యోధుడాయన. ఆ సమయంలో నేను ఆర్‌ఎ్‌సఎస్‌ యువ ప్రచారక్‌గా ఉన్నాను. నాటి చీకటి రోజులు గుర్తున్నవారు, అప్పుడు బాధలు పడినవారు తమ అనుభవాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరుతున్నాను. 1975-77 మధ్యకాలం ఎంత సిగ్గుచేటైన సమయమో అది యువతకు తెలియజేస్తుంది’ అని తెలిపారు. ఎమర్జెన్సీని ఏటా ‘రాజ్యాంగ హత్యాదినం’గా పాటిస్తామని మోదీ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఎమర్జెన్సీ బాధితుల త్యాగాలను స్మరించుకొని, గౌరవించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాజ్యాంగ బద్ధంగా దక్కిన హక్కులకు దూరమై, ఊహకు కూడా అందని భయానక పరిస్థితులు అనుభవించిన వారికి నివాళిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ ఏడాదితో సంవిధాన్‌ హత్యా దివ్‌సకు 50 ఏళ్లు పూర్తయిందని పేర్కొంది.


స్వామీజీ వేషంలో జైలుకు మోదీ!

ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలో గడిపిన మోదీ.. ఒకసారి స్వామీజీ వేషంలో గుజరాత్‌లోని భావనగర్‌ జైలును సందర్శించారు. అక్కడ నిర్బంధంలో ఉన్న ఆర్‌ఎ్‌సఎస్‌ కార్యకర్తలను పరామర్శించారు. ఈ సంఘటనను మోదీ పుస్తకంలో ప్రస్తావించారు. మోదీ 1976 సెప్టెంబరులో భావనగర్‌ జైలు సందర్శించినప్పుడు జైల్లోనే ఉన్న జర్నలిస్టు విష్ణు పాండ్య నాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నాడు జాతీయ స్థాయిలో ఆవిర్భవించిన సంఘర్ష్‌ సమితిలో మోదీ సభ్యుడిగా ఉండేవారు. 200 మంది సంఘ్‌ కార్యకర్తలు, సర్వోదయ సభ్యుడొకరు భావనగర్‌ జైల్లో ఉండేవారు. ఆయన తరచూ మాకు పుస్తకాలు తెచ్చి వచ్చేవారు. నాడు స్వామీజీ వేషంలో జైల్లో ప్రవేశించారు. తన ‘అనుచరులను’ కలిసేందుకు అనుమతి సంపాదించారు. మాతో గంటసేపు గడిపారు’ అని తెలిపారు. తప్పించుకోవడానికి ఎక్కువ ద్వారాలు ఉన్న ఇళ్లలోనే మోదీ తలదాచుకునేవారని సుదీర్ఘకాలంగా సంఘ్‌ కార్యకర్తగా ఉన్న నగర్‌భాయ్‌ చావ్‌డా గుర్తుచేసుకున్నారు.

Updated Date - Jun 26 , 2025 | 06:00 AM