PM Modi On Constitution Day: కొత్త ఓటర్లను గౌరవించండి.. భారత పౌరులకు ప్రధాని లేఖ
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:18 AM
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ఆయన దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవించాలని అందులో సూచించారాయన.
ఇంటర్నెట్ డెస్క్: నేడు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ దేశ పౌరులకు ఓ లేఖ రాశారు. దేశంలో నూతన ఓటర్లను గౌరవించాలని అందులో కోరారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లను గౌరవిస్తూ.. పాఠశాలలు, కళాశాలలు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు మోదీ. విధుల నిర్వహణ నుంచే హక్కులు పుట్టుకొస్తాయని, జాతిపిత మహాత్మా గాంధీ దీన్నే విశ్వసించారని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. విధులను నిర్వర్తించడం అనేది సామాజిక, ఆర్థిక పురోగతికి పునాది వంటిదని స్పష్టం చేశారు.
నేడు మనం తీసుకునే నిర్ణయాలు, నిర్వర్తించే బాధ్యతలే.. భావి జీవితాన్ని నిర్మిస్తాయని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చెప్పారు. దేశం.. వికసిత్ భారత్ దిశగా ముందడుగు వేస్తున్నప్పుడు పౌరులు కూడా తమ విధులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. 'మన రాజ్యాంగం.. గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ వంటి వాటికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుంది. మనకు హక్కులను కల్పిస్తూనే.. పౌరులుగా మన విధులనూ గుర్తుచేస్తుంది. వీటిని నెరవేర్చడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. అవే బలమైన ప్రజాస్వామ్యానికి పునాది' అని మోదీ పేర్కొన్నారు.
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు మోదీ. వారి దార్శనికత, దూరదృష్టి.. వికసిత్ భారత్‌ను నిర్మించాలనే ప్రయత్నంలో మనల్ని నిరంతరం ప్రేరేపిస్తూనే ఉంటాయని చెప్పారు.
భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని 2015 నుంచి ఏటా దేశవ్యాప్తంగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం, సంవిధాన్ దివస్‌ను జరుపుకుంటున్నారు. రాజ్యాంగంలోని కొంత భాగం వెంటనే అమల్లోకి రాగా, పూర్తిగా మాత్రం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది.
ఇవీ చదవండి: