India reaffirms Arunachal: అరుణాచల్ భారత్‌లో అంతర్భాగమే.. చైనా వాదనపై భారత్ ఆగ్రహం
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:49 AM
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఓ భారత మహిళను షాంఘై విమానాశ్రాయంలో చైనా అధికారులు నిర్బంధించడంపై భారత్ మండిపడింది. చట్టబద్ధంగా చెల్లుబాటయ్యే ఇండియా పాస్‌పోర్ట్ ఆమెకు ఉన్నప్పటికీ అక్కడి అధికారులు ఆమెకు అనుమతి నిరాకరించడం పట్ల తమ దౌత్యపరమైన నిరసనను తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగమని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. డ్రాగన్ దేశంలోని షాంఘై విమానాశ్రయంలో ఓ భారతీయ మహిళను నిర్బంధించడాన్ని తప్పుబడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది విదేశాంగ శాఖ. చైనా నుంచి ఎన్ని తిరస్కరణలు వచ్చినా ఈశాన్య భారత రాష్ట్రంపై ఉన్న వాస్తవాలను మార్చలేవని పునరుద్ఘాటించింది.
చైనా విదేశాంగ శాఖ చేసిన ప్రకటనలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ ఇండియాకు చెందినదేనని, డ్రాగన్ వైపు నుంచి ఎన్ని తిరస్కరణ వాదనలు వచ్చినా ఈ వాస్తవాన్ని మార్చలేమని ఆయన స్పష్టం చేశారు. చైనా అధికారులు కావాలనే థాంగ్‌డోక్ పాస్‌పోర్ట్ చెల్లదని ప్రకటిస్తూ వింత కారణాలతో ఆమెను వేధించి నిర్బంధించారని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతో చైనా వలస నిబంధనలను ఉల్లంఘించిందని స్పష్టంగా బహిర్గతమవుతోందని.. ఈ ప్రదర్శనా తీరుపై తీవ్ర నిరసన తెలిపింది. ఇలాంటి చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని, భారత పౌరులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని స్పష్టం చేసింది.
ఏం జరిగిందంటే.?
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ప్రేమా వాంగ్‌జోమ్ థాంగ్‌డోక్ అనే మహిళ ప్రస్తుతం యూకేలో ఉంటున్నారు. ఆమె ఇటీవల లండన్ నుంచి జపాన్‌కు వెళ్లినప్పుడు.. చైనాలోని షాంఘై విమానాశ్రయంలో అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. సుమారు 18 గంటలపాటు తనను నిర్బంధించారని ఆమె తెలిపారు. తన ఇండియన్ పాస్‌పార్ట్‌లో జన్మస్థలం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో, ఆ రాష్ట్రం భారత భూభాగంలోకి వర్తించదని ఆరోపిస్తూ అనుమతి నిరాకరించారని థాంగ్‌డోక్ పేర్కొన్నారు. తనను పదే పదే ప్రశ్నిస్తూ విరుద్ధమైన సూచనలిచ్చారని ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వివరించారు.
ఈ ఆరోపణల్ని చైనా విదేశీ వ్యవహారాల శాఖ తోసిపుచ్చింది. తమ దేశంలో అమలులో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలకు అనుగుణంగానే అధికారులు కఠినంగా వ్యవహరించారని పేర్కొంది. 'మా అధికారులు.. నిష్పాక్షికంగా చట్టాన్ని అమలు చేశారు. ఎక్కడా అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. సంబంధిత వ్యక్తి చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పూర్తిగా రక్షించారు. ఎయిర్‌లైన్ వ్యవస్థ ఆమెకు విశ్రాంతి, భోజన సౌకర్యాలు అందించి సహకరించింది. ఆమెను నిర్బంధించలేదు, అలాంటి చర్యలేవీ తీసుకోలేదు' అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మానో నింగ్ చెప్పారు.
అయితే.. అరుణాచల్ ప్రదేశ్‌పై తమ ప్రాదేశిక వాదనను మరోసారి కొనసాగించారు మానోవింగ్. జాంగ్నాన్ భూభాగం చైనాకు సంబంధించినదనే అంశాన్ని లేవనెత్తారు. భారత్.. అరుణాచల్ ప్రదేశ్‌గా పిలిచే ఆ ప్రాంతాన్ని చైనా ఎప్పుడూ గుర్తించలేదన్నారు.
ఇవీ చదవండి: