Ayodhya Flag Ceremony: మానుతున్న శతాబ్దాల గాయాలు
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:19 AM
అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో భారత ఆత్మకు శతాబ్దాలుగా అయిన గాయాలు మానుతున్నాయని, బాధ ఉపశమిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారత్‌తోపాటు మొత్తం ప్రపంచమే శ్రీరాముడి భక్తిలో మునిగిపోయిందని తెలిపారు. అయోధ్యలో......
నేడు ప్రపంచమంతా రామభక్తిలో మునిగింది
అయోధ్యలో రామ మందిరంపై ధ్వజారోహణం సందర్భంగా ప్రధాని మోదీ
అయోధ్య, నవంబరు 25: అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో భారత ఆత్మకు శతాబ్దాలుగా అయిన గాయాలు మానుతున్నాయని, బాధ ఉపశమిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు భారత్‌తోపాటు మొత్తం ప్రపంచమే శ్రీరాముడి భక్తిలో మునిగిపోయిందని తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా మంగళవారం ధ్వజారోహణం నిర్వహించారు. ఉత్సవ శోభ సంతరించుకున్న అయోధ్యా నగరంలో వేలమంది భక్తుల ‘జైశ్రీరామ్’ నినాదాల మధ్య ప్రధాని మోదీ కాషాయ జెండాను ఆలయ శిఖరంపై రిమోట్ ద్వారా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ‘500 ఏళ్ల ఆకాంక్ష ఎట్టకేలకు నెరవేరింది. ఈ ధ్వజారోహణ కార్యక్రమం ఎంతో ప్రత్యేకమైన దైవకార్యం. ఆలయంపై రెపరెపలాడుతున్న ఈ కాషాయ జెండా ఎప్పటికైనా అబ ద్ధాలపై నిజమే విజయం సాధించి తీరుతుందని నిరూపిస్తోంది’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం పోరాటం చేసిన చేసినవారితోపాటు ఆలయ నిర్మాణానికి సహకరించిన వారికి, రామ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘త్రేతాయుగం నాటి అయోధ్య మానవతకు నైతిక మార్గంగా ఉండేది. 21వ శతాబ్దపు అయోధ్య నూతన అభివృద్ధి విధానానికి చిహ్నంగా మారింది’ అని తెలిపారు.
ఆత్మన్యూనత నుంచి బయటపడదాం
ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి అని ప్రధాని మోదీ తెలిపారు. తమిళనాడులో వెయ్యేళ్లనాటి శాసనంలో ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి వివరించారు. ‘‘మన డీఎన్‌ఏలోనే ప్రజాస్వామ్యం ఉంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను వేరే దేశం నుంచి తెచ్చుకున్నామని వలసవాద భావజాలం వల్ల నేడు మనం భ్రమపడుతున్నాం. భారతీయ ఘనతను తలకిందులు చేసే విత్తనాలను 190 ఏళ్ల క్రితం మెకాలే చల్లాడు. మన జాతీయ చిహ్నాల రూపకల్పనలో కూడా ఈ భావాలు ప్రభావం చూపాయి. మనం స్వాతంత్య్రమైతే సాధించాం కానీ, ఆత్మన్యూనత నుంచి స్వాతంత్య్రం పొందలేదు. ఈ రకమైన ఆలోచనా విధానం నుంచి బయటపడేందుకు వచ్చే పదేళ్ల కాలాన్ని కేటాయించాలి. అందులో భాగంగానే ఇటీవల మన నౌకాదళం పతాకాన్ని కొత్తగా రూపొందించాం. అది కేవలం డిజైన్ మార్పు మాత్రమే కాదు. మన ఆలోచనల్లో మార్పు’’ అన్నారు .
ప్రధాని భావోద్వేగం
అయోధ్యలో రామ మందిరం పునర్‌నిర్మించాలన్న శతాబ్దాల నాటి కల నెరవేరటంతో కోట్లాది మంది హిందువులు పులకించిపోతున్నారు. మంగళవారం ఽఆలయంపై స్వయంగా ధ్వజారోహణం చేసిన ప్రధాని మోదీ కూడా తన్మయత్వానికి లోనయ్యారు. ఆలయంపై ధ్వజం రెపరెపలాడగానే దానికి రెండు చేతులు జోడించి దండంపెట్టారు. ఆ సమయంలో మోదీ చేతులు వణికాయి. ఆ దృశ్యం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధ్వజారోహణకార్యక్రమానికి ప్రముఖులతోపాటు పలువురు సామాన్యులను కూడా అతిథులుగా ఆహ్వానించారు. అతిథుల్లో సోన్‌భద్రకు చెందిన ఆదివాసీలు, రామమందిరం-బాబ్రీ మసీదు కేసులో ప్రతివాది అయిన హషీమ్ అన్సారీ కుమారుడైన ఇక్బాల్ కూడా ఉన్నారు. ఽధ్వజారోహణం సందర్భంగా అయోధ్య నగరం ఉత్సవ శోభను సంతరించుకుంది. ఎటుచూసినా జైశ్రీరామ్ నినాదాలు మారుమోగాయి. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
అమరుల ఆత్మలు శాంతించాయి
అయోధ్య రామాలయ నిర్మాణం కోసం త్యాగాలు చేసినవారి ఆత్మలు ఆలయ ధ్వజారోహణ ంతో శాంతించాయని ఆర్‌ఎ్‌సఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘ఈరోజు మనకు ఎంతో గొప్ప రోజు. సుదీర్ఘ కాలంగా ఉన్న మన కల నెరవేరిన రోజు. మన త్యాగాలన్నీ ఫలించిన రోజు. అశోక్‌సింఘాల్ (విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు)కు నిజమైన శాంతి లభించిన రోజు. ఎంతోమంది రామమందిరం కోసం త్యాగాలు చేశారు’ అని పేర్కొన్నారు. అయోధ్య రామాలయంపై ధ్వజారోహణ కార్యక్రమం దేశంలో నూతన శకానికి నాంది అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
పాంచజన్య మెమోరియల్ ప్రారంభం
మహాభారత సంగ్రామం జరిగిన హరియాణాలోని కురుక్షేత్రలో నిర్మించిన పాంచజన్య మెమోరియల్‌ను మోదీ మంగళవారం ప్రారంభించారు. శ్రీకృష్ణుడి శంఖమైన పాంచజన్యానికి గుర్తుగా దీనిని అదే ఆకారంలో నిర్మించారు. పాంచజన్య విగ్రహం 5.5 టన్నుల బరువు ఉంది. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా నిర్మించిన అనుభవ్ కేంద్రాన్ని కూడా మోదీ సందర్శించారు. అక్కడే సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ 350వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధ్వజం ప్రత్యేకతలు
కాషాయ ధ్వజం రూపకల్పనలో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. త్రిభుజాకారంలో ఉన్న ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవు ఉంది. దానిపైౖ శ్రీరాముడి వంశమైన భగవాన్ సూర్యుడితోపాటు ఓంకారాన్ని ముద్రించారు. శ్రీరాముడి కాలంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న కోవిదార వృక్షాన్ని కూడా ధ్వజంపై ముద్రించారు. త్రేతాయుగంలో కశ్యప మహర్షి మందార, పారిజాత చెట్లను అంటుకట్టి ఈ కోవిదార వృక్షాన్ని సృష్టించినట్లు చెబుతారు. శ్రీరాముడి సోదరుడైన భరతుడి రఽథ ధ్వజంలో ఈ వృక్షపు చిహ్నమే ఉంటుంది.
