Share News

Pakistan Alert: పాకిస్థాన్‌కు యుద్ధ భయం

ABN , Publish Date - Apr 25 , 2025 | 03:50 AM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చర్యలకు భయపడిన పాకిస్థాన్, సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ నిఘాను పెంచుతూ, భారత్‌పై ఫ్లాగ్ ఆపరేషన్ ఆరోపణలు చేస్తోంది

Pakistan Alert: పాకిస్థాన్‌కు యుద్ధ భయం

  • సరిహద్దులకు సైన్యం.. నిఘా పెంపు

  • ఆగమేఘాలపై క్షిపణుల పరీక్షలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకోనుందోనని దాయాది దేశం పాకిస్థాన్‌లో ఆందోళన మొ దలైందా? అందుకే.. క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ.. సరిహద్దుల్లో నిఘాను పెంచుతూ.. సైన్యాన్ని తరలిస్తోందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే సమాధానం చెబుతున్నాయి.

సరిహద్దుల్లో హై అలర్ట్‌

పాకిస్థాన్‌ రక్షణ శాఖ బుధవారం నుంచే సరిహద్దుల్లో అప్రమత్తమైంది. సైన్యం, యుద్ధ ట్యాంకులను నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్దకు పంపడమే కాకుండా.. నిఘా, సైన్యం రవాణా విమానాలను తరలించింది. గురువారం ఆగమేఘాలపై క్షిపణి పరీక్షలు నిర్వహించగా.. భారత్‌ ఎలాంటి చర్యలకు దిగినా.. ఎదుర్కొనేందుకు సిద్ధమేనంటూ.. రక్షణ శాఖ మంత్రి ఖావాజా ఆసిమ్‌ ప్రకటించడం గమనార్హం..!


‘ఫ్లాగ్‌ ఆపరేషన్‌’పై పదేపదే ప్రకటనలు

భారత్‌ తమపై అభాండాలు(తప్పుడు ‘ఫ్లాగ్‌ ఆపరేషన్‌’) మోపుతోందని పాక్‌ ప్రభుత్వం బుధవారం నుంచి ఆరోపణలు గుప్పిస్తోంది. పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన జాతీయ భద్రత సమావేశం తర్వాత.. ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్‌ ధార్‌, రక్షణ మంత్రి ఖావాజా ఆసిమ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఇదే అంశాన్ని ఎత్తిచూపారు. ‘‘పహల్గాం దాడి తర్వాత ఎలాంటి విచారణ జరపకుండానే.. పాక్‌పై ఆరోపణలు చేశారు. ఫ్లాగ్‌ ఆపరేషన్‌ ద్వారా ఉగ్రదాడులకు సంబంధించి ఒక దేశం లేదా ఒక సంస్థపై దాడికి సిద్ధమనడానికి యుద్ధ వ్యూహం లాంటిదే. ఇప్పుడు భారత్‌ అదే చేస్తోంది.’’ అని విమర్శించారు.

భారత్‌పై ఉగ్రవాద నెపం

పాక్‌ రక్షణ మంత్రి ఖావాజా ఆసిమ్‌ ఏకంగా భారత్‌పై ఉగ్రవాద నెపం మోపారు. ‘‘మాకు ఉన్న నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద దాడులకు భారత్‌ కుట్రలు చేస్తోంది. మేం ఒకటే చెబుతున్నాం. మా పౌరులపై దాడి జరిగితే.. భారత పౌరులు కూడా సురక్షితంగా ఉండరు. యుద్ధానికి బదులుగా భారత్‌ మాపై ఉగ్రవాదానికి సిద్ధమవుతోంది. భారత్‌ ఏదైనా సాహసానికి దిగితే.. తగిన సమాధానం ఇస్తాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: పాకిస్తానీలు 48 గంటల్లో ఇండియా వదలి వెళ్లాలని కేంద్ర ఆదేశం..

Fauji Actress Imanvi: పుకార్లపై స్పందించిన ప్రభాస్ హీరోయిన్

Updated Date - Apr 25 , 2025 | 03:50 AM