Upendra Dwivedi: 88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ABN , Publish Date - Nov 17 , 2025 | 03:59 PM
నేడు యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, 'ఆపరేషన్ సిందూర్' 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు లేదా నాలుగేళ్లూ పట్టవచ్చని జనరల్ ద్వివేది అన్నారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై జరిపిన మిలటరీ చర్య 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) అన్నారు. గతేడాది చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఒక ట్రైలర్ మాత్రమేనని, పొరుగుదేశం మళ్లీ దారి తప్పితే గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సోమవారంనాడిక్కడ జరిగిన 'చాణక్య రక్షణ సదస్సు'లో ఆయన మాట్లాడుతూ, 88 గంటలపాటు సాగించిన 'ఆపరేషన్ సిందూర్' ఒక ట్రైలర్ మాత్రమేనని అన్నారు.
'భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. పాక్ తిరిగి దారి తప్పితే ఎలా బాధ్యతగా వ్యవహరించాలో గుణపాఠం నేర్పిస్తాం' అని జనరల్ ద్వివేది అన్నారు. ఎప్పుడు ఆపరేషన్ చేపట్టినా దాని నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవడం జరుగుతుందని, త్రివిధ దళాల మధ్య సమన్వయం, సరఫరాలు సక్రమంగా అందేలా చూసుకోవడం, ప్రతి దశలోనూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వంటివి చాలా కీలకమైనవిగా 'ఆపరేషన్ సిందూర్' నుంచి గ్రహించినట్టు చెప్పారు. అతి తక్కువ సమయంలోనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రతి దశలోనూ సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం అనివార్యమని చెప్పారు. బలగాల మధ్య సమన్యయం చాలా అవసరమని, అందులోనూ యుద్ధాలు ఇవాళ బహుళ మాధ్యమాల్లో జరుగుతున్నాయని అన్నారు. భూమి, ఆకాశం, సైబర్ రంగం, సమాచార యుద్ధం... వెరసి సమగ్ర యుద్ధం అవుతోందన్నారు. ఆర్మీ మాత్రమే యుద్ధం సాగించలేదని, ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా యుద్ధం సాగించాల్సి ఉంటుందని చెప్పారు.
యుద్ధం ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేం
ఇవాళ యుద్ధం అంటూ వస్తే ఎన్ని గంటలు జరుగుతుందో చెప్పలేమని, ఆపరేషన్ సిందూర్ 88 గంటలపాటు సాగించామని, వచ్చేసారి నాలుగు నెలలైనా కావచ్చు, నాలుగేళ్లూ పట్టవచ్చని అన్నారు. ఇలాంటప్పుడు యుద్ధానికి సరిపడినన్ని ఆయుధాలు మన వద్ద ఉన్నాయా? అనేది చూసుకోవాలని, లేనిపక్షంలో అందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రఘటన అనంతరం భారత్ తీసుకువచ్చిన 'న్యూ నార్మల్' విధానంపై మాట్లాడుతూ, ఒకే సమయంలో చర్చలు, ఉగ్రవాదం కొనసాగలేవని చాలా స్పష్టంగా ఈ విధానంలో చెప్పడం జరిగిందన్నారు. ఒక దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంటే, అది ఇండియాకు ఆందోళన కలిగించే విషయమని, ప్రగతిని ఇండియా కోరుకుంటోందని, అందుకు అవరోధం కలిగించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. శాంతియుత ప్రక్రియకు భారత్ సహకరిస్తుందని, అప్పటివరకూ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తున్న వారికి ఒకే రీతిన గుణపాఠం చెబుతుందని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితిపై మాట్లాడుతూ, 370వ అధికరణ రద్దు తర్వాత ఉగ్రవాద ఘటనలు తగ్గాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
మదీనా రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి..
ఢిల్లీలో కారు పేలుడుకు ‘మదర్ ఆఫ్ సైతాన్’?
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.