Share News

Illegal Entry: యూపీలో ఇద్దరు బ్రిటిష్‌ వైద్యుల అరెస్టు

ABN , Publish Date - Nov 17 , 2025 | 04:23 AM

తగిన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు బ్రిటిష్‌ వైద్యులను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Illegal Entry: యూపీలో ఇద్దరు బ్రిటిష్‌ వైద్యుల అరెస్టు

పత్రాలు లేకుండా అక్రమంగా నేపాల్‌ నుంచి ప్రవేశం

న్యూఢిల్లీ, నవంబరు 16: తగిన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇద్దరు బ్రిటిష్‌ వైద్యులను ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మహిళ కావడం గమనార్హం. నేపాల్‌ నుంచి అక్రమంగా వస్తుండగా బహరాయిచ్‌ జిల్లా రూపైదెహా సరిహద్దు వద్ద శనివారం సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ) పట్టుకొని పోలీసులకు అప్పగించింది. బ్రిటిష్‌ పాసుపోర్టులు ఉన్న వారిద్దరిని డాక్టర్‌ హస్సన్‌ అమ్మన్‌ సలీం (35), డాక్టర్‌ సుమిత్ర షకీల్‌ ఒలీవియా (61)గా గుర్తించారు. సలీం ప్రస్తుత చిరునామా మాంచెస్టర్‌ కాగా, తండ్రి మహమ్మద్‌ సలీం పాకిస్థాన్‌ మూలాలు ఉన్న వ్యక్తి. అమ్మన్‌ సలీం గతంలో మూడుసార్లు పాకిస్థాన్‌ వెళ్లినట్టు తెలిసింది. సుమిత్ర చిరునామా గ్లౌసెస్టర్‌ కాగా, స్వస్థలం కర్ణాటకలోని ఉడిపి. తండ్రి పేరు జాన్‌ ఫ్రెడరిక్‌. నేపాల్‌లోని నేపాల్‌గంజ్‌కు చెందిన స్థానిక ఆస్పత్రి ఆహ్వానం మేరకు అక్కడికి వచ్చినట్టు వారు చెప్పారని ఎస్‌ఎ్‌సబీ 42వ బెటాలియన్‌ కమాండర్‌ గంగాసింగ్‌ ఉదావత్‌ తెలిపారు. వారి వద్ద భారత్‌ వీసా లేదని చెప్పారు. ఇటువైపు ఎందుకు వచ్చారో పత్రాలను తనిఖీ చేస్తున్న సమయంలో సంతృప్తికరమైన సమాధానం కూడా ఇవ్వలేదని చెప్పారు.

Updated Date - Nov 17 , 2025 | 04:24 AM