Akhilesh Yadav: యూపీ విపక్షానికి ‘బిహార్’ ఫీవర్!
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:17 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్(యూపీ)లో చర్చ మొదలైంది. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్డీయే విజయం, బీజేపీ స్ట్రాటజీపై ఉత్తరప్రదేశ్ ప్రతిపక్షాల్లో గుబులు
ఇండియా కూటమి భవితపై చర్చ
2027లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు
లఖ్‌నవూ, నవంబరు 16: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్(యూపీ)లో చర్చ మొదలైంది. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలు ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారాయి. దీంతో బిహార్‌లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి అనుసరించిన విధానాలను యూపీలో కూడా అనుసరిస్తే ఏమేరకు విజయం దక్కుతుందన్నది సందేహంగా మారింది. మరీ ముఖ్యంగా 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో యూపీలో విపక్షాలు భారీగా లబ్ధి పొందాయి. అయితే.. ఇప్పుడు బిహార్ ఫలితం తర్వాత.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తరహా విజయం.. ప్రజల ఆదరణ లభించేనా అన్నది కీలకంగా మారింది. ఇక, బిహార్ ఫలితం యూపీ అధికార పార్టీ బీజేపీలో మరింత ఉత్సాహాన్ని నింపగా అదేసమయంలో విపక్ష శిబిరంలో మాత్రం అనేక సందేహాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై సమీక్ష, కూటమి నేతల్లో అనుమానాలను రాజేసింది. ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్‌తో పోల్చడమే కాకుండా మావోయిస్టు పార్టీ అని సంబోధించారు. అంతేకాదు.. కాంగ్రెస్ ఇక, చీలికలు పేలికలుగా మారుతుందన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించే కాకుండా యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ చాలా వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై యూపీలో తీవ్ర చర్చ సాగుతోందని అంటున్నారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందిస్తూ.. ‘‘మగధ తర్వాత ఇప్పుడు అవధ్.’’ అంటూ.. బిహార్ తరహా విజయాన్నే యూపీలోనూ సొంతం చేసుకుంటామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, బిహార్‌లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే యూపీలోనూ అనుసరించనున్నట్టు చెప్పారు. యూపీ విపక్షం సమాజ్ వాదీపార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్.. బిహార్ ఫలితంపై స్పందిస్తూ.. బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘‘బీజేపీ.. రాజకీయ పార్టీకాదు. రాజకీయ మోసకారి’’ అని వ్యాఖ్యానించారు. అయితే, ఇదేసమయంలో బీజేపీ అనుసరించిన ఎన్నికల వ్యూహాలను ప్రతిపక్షాలు కూడా నేర్చుకోవాలని పేర్కొనడం విశేషం.
ఎస్పీ-కాంగ్రెస్ బంధం కొనసాగేనా
2024 పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ల కూటమి 43 స్థానాలను దక్కించుకుంది. అయితే..ఇప్పుడు బిహార్ ఎన్నికల అనంతరం.. ఈ రెండు పార్టీలు 2027 వరకు కలిసే కొనసాగుతాయా? అనే సందేహాలు తెరమీదకి వచ్చాయి. ఈ రెండు పార్టీలూ పైకి ‘అంతా బాగానే ఉంది.’ అని వ్యాఖ్యానిస్తున్నా రాజకీయాలు మాత్రం ఆవిధంగా లేదన్నది విశ్లేషకుల మాట. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అఖిలేశ్ యాదవ్, రాహుల్‌గాంధీల మధ్య విభేదాలు చొటుచేసుకున్నాయి. నాటి పరిణామాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
రేపు ఏఐసీసీ ఇన్‌చార్జుల భేటీ
12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతా(యూటీ)ల్లో ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్‌ఐఆర్)పై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల ఏఐసీసీ ఇన్‌చార్జులు/ప్రధాన కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ కార్యదర్శులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. బిహార్ ఫలితాలపైనా ఈ సందర్భంగా సమీక్షిస్తారు. కాగా.. తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గోవా, గుజరాత్, రాజస్థాన్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవుల్లో ఇప్పటివరకు 48.67 కోట్ల ‘సర్’ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని కమిషన్ ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.