Share News

DK Shivakumar: కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 12 , 2025 | 02:59 PM

కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పడు అధికార పంపకాల విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఒక అవగాహన కుదిరిందనే వాదన మొదట్నించీ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా పగ్గాలు పట్టుకుంటే, తక్కిన రెండున్నరేళ్లు డీకే పగ్గాలు చేపడతారనేది ఆ ఒప్పందం.

DK Shivakumar: కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. ఐదేళ్లూ సీఎంగా కొనసాగుతానంటూ సిద్ధరామయ్య పదేపదే చెబుతుండగా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరోక్షంగా సీఎం కుర్చీపై తనకున్న ఆశలను చెప్పకనే చెబుతున్నారు. బెంగళూరు అడ్వకేట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కేంపేగౌడ్ జయంతి ఉత్సవాల్లో డీకే శివకుమార్ (DK Shivakumar తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కుర్చీ దొరికితే వదలొద్దు' అంటూ ఆయన వ్యాఖ్యానించారు.


కార్యక్రమంలో పలువురు లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోకపోవడాన్ని డీకే ప్రస్తావిస్తూ... 'ఇక్కడ చాలా మంది లాయర్లు సీట్లు ఖాళీగా ఉన్నా కూర్చోవడం లేదు. మేమంతా ఒక కుర్చీ కోసం తీవ్ర పోరాటాలు చేస్తుంటాం. కుర్చీ సంపాదించడం అంత సులభం కాదు. మీకు కూర్చునే అవకాశం వస్తే అందులో కూర్చోవాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి' అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. కర్ణాటకలో అధికార పోరాటం అంశాన్ని డీకే నేరుగా ప్రస్తావించనప్పటికీ 'చైర్' అనే పదాన్ని సందర్భోచితంగా ప్రస్తావించడంతో ఆడిటోరియంలో నవ్వులు వెల్లివిరిసాయి.


కర్ణాటకలో 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పడు అధికార పంపకాల విషయంలో సిద్ధరామయ్య, డీకే మధ్య ఒక అవగాహన కుదిరిందనే వాదన మొదట్నించీ వినిపిస్తోంది. మొదటి రెండున్నరేళ్లు సిద్ధరామయ్య సీఎంగా పగ్గాలు పట్టుకుంటే, తక్కిన రెండున్నరేళ్లు డీకే పగ్గాలు చేపడతారనేది ఆ ఒప్పందం. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ అవునని కానీ కాదని కానీ ఇంతవరకూ తేల్చిచెప్పలేదు. దీనిపై సిద్ధరామయ్య గురువారంనాడు సూటిగా స్పందించారు. సీఎం సీటు ఖాళీగా లేదని, తాను ఐదేళ్లు అధికారంలో ఉంటానని తేల్చిచెప్పారు. నాయకత్వం అంశం అధిష్ఠానం వద్ద లేదని, అది పరిష్కారమైందని, కాంగ్రెస్ అధిష్ఠానం తనకు పూర్తి బాసటగా ఉందని చెప్పారు. ఢిల్లీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన డీకే సైతం సిద్ధరామయ్య వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించారు. 'హైకమాండ్ ఏమి చెప్పిందో సిద్ధరామయ్య ఇప్పటికే చెప్పారు. మీ ప్రశ్నలన్నింటికీ ఆయన సమాధానమిచ్చారు' అని డీకే అన్నారు. తనకు ఎలాంటి తొందరా లేదని, మీరెందుకు తొందర పడుతున్నారని మీడియాను ప్రశ్నించారు.


ఆయన మౌనం వెనుక... ఆంతర్యం ఏమిటో..

ఐఐఎమ్ కోల్‌కతాలో దారుణం.. బాయ్స్ హాస్టల్‌లో యువతిపై అత్యాచారం..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 12 , 2025 | 03:53 PM