IIM Calcutta Incident: అత్యాచారం కాదు, ఆటో నుంచి పడిపోయింది... ఐఐఎం కోల్‌కతా విద్యార్థిని తండ్రి
ABN , Publish Date - Jul 12 , 2025 | 07:50 PM
బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారం జరిపినట్టు భావిస్తున్న ఐఐఎం హాస్టల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది గంటలకే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.

కోల్‌కతా: కోల్‌కతా ఐఐఎం ఫస్ట్ ఇయర్ విద్యార్థినిపై అత్యాచార ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమెపై అత్యాచారం జరిపినట్టు భావిస్తున్న ఐఐఎం హాస్టల్ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత కొద్ది గంటలకే ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తన కుమార్తెపై ఎలాంటి అత్యాచారం జరగలేదని, ఆటో రిక్షా నుంచి ఆమె పడిపోయిందని విద్యార్థిని తండ్రి మీడియాకు తెలిపారు.
శుక్రవారం రాత్రి 9.34 గంటలకు తన కుమార్తె ఆటో నుంచి పడిపోయి స్పృహ కోల్పోయినట్టు తనకు సమాచారం వచ్చిందని ఆయన తెలిపారు. పోలీసులు ఆమెను కాపాడి ఎస్ఎస్‌కేఎం ఆసుపత్రిలోని న్యూరాలజీ విభాగంలో చేర్చారని వివరించారు. తన కుమార్తెపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని విద్యార్థిని తండ్రి స్పష్టంచేశారు.
'కేసు నమోదు చేసి ఎవరినో అరెస్టు చేసినట్టు పోలీసులు నాకు చెప్పారు. అమ్మాయితో మాట్లాడాను. పోలీసులు ఏదో చెప్పమంటే చెప్పానని నాతో అంది. ఎవరూ తనను వేధించలేదని, అనుచితంగా ప్రవర్తించలేదని చెప్పింది. దాంతో అమ్మాయిని నాతో తీసుకు వెళ్లాను. ఆమె మామూలుగానే ఉంది. అరెస్టయిన వ్యక్తితో నా కుమార్తెతో ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయి నిద్రపోవడంతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయాను. నిద్ర నుంచి లేచాక మాట్లాడతాను. ఫిర్యాదులో భాగంగా పోలీస్ స్టేషన్‌లో ఏదో రాయమని చెబితే అదే రాసింది' అని ఆయన వివరించారు. అమ్మాయి శారీరకంగా, మానసికంగా గాయపడిందా అని మీడియా అడిగినప్పుడు అలాంటిదేమీ లేదని, పూర్తి ఫిట్‌నెస్‌తో ఉందని ఆయన సమాధానమిచ్చారు.
దీనికి ముందు, తనను కౌన్సిలింగ్ సెషన్ పేరుతో హాస్టల్‌కు రమ్మన్నారని, హాస్టల్‌లో డ్రగ్స్ కలిపిన ద్రావకం ఏదో తాగడంతో స్పృహతప్పిపోయానని, తిరిగి స్పృహలోకి వచ్చేసరికి తాను అత్యాచారానికి గురైనట్టు గ్రహించానని ఎఫ్ఐఆర్‌లో ఆమె పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయడంతో అతన్ని జూలై 19 వరకూ పోలీసు కస్టడీకి అప్పగించారు. కాగా, నిందితుడిపై తప్పుడు కేసు బనాయించినట్టు అతని తరఫు లాయర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
గోకర్ణ గుహలో ఇద్దరు పిల్లలతో రష్యా మహిళ
కుర్చీ దొరికితే వదలొద్దు.. డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి