Prashant Kishor: రాసిస్తా...నితీష్ తిరిగి సీఎం అయ్యేదే లేదు
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:48 PM
ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా జనతాదళ్ (యూ), బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు పనిచేశారు. తాజాగా ఆయన బీహార్‌లో జరిపిన సర్వే వివరాలను వెల్లడిస్తూ, 62 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తాను, తన టీమ్ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు.

పాట్నా: బీహార్‌లోని 60 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తరువాత జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీష్ కుమార్ (Nitish Kumar) ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని జన్ సురాజ్ (Jan Suraaj) పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అన్నారు. ఈ విషయం రాసి పెట్టుకోండని ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రశాంత్ కిషోర్ గతంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా జనతాదళ్ (యూ), బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలకు పనిచేశారు. తాజాగా ఆయన బీహార్‌లో జరిపిన సర్వే వివరాలను వెల్లడిస్తూ, 62 శాతం ప్రజలు మార్పును కోరుకుంటున్నట్టు తాను, తన టీమ్ చేసిన సర్వేలో తేలిందని చెప్పారు. వీరంతా జన్ సురాజ్ పార్టీకి ఓటు వేస్తారా, పాత పార్టీలైన లాలూ యాదవ్ ఆర్జేడీ, కాంగ్రెస్‌కు ఓటు వేస్తారా అనేదే ప్రస్తుతం అందరి ముందున్న ప్రశ్న అని చెప్పారు.
'మార్పును కోరుకునే 60 శాతం మంది ఎవరికి ఓటు వేయాలని నిర్ణయిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. తమ కోసం ఏమాత్రం పనిచేసిన వారినే మళ్లీ విశ్వసిస్తారా, ప్రత్యామ్నాయాన్ని ఎన్నుకుంటున్నారా అనేది చూడాలి. ఏది జరిగినా నవంబర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత నితీష్ మాత్రం ముఖ్యమంత్రి కారని నిశ్చయంగా చెప్పగలను. ఆ విషయం రాసి ఇస్తాను. బీహార్‌కు కొత్త ముఖ్యమంత్రి వస్తారు' అని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. అంత ధీమాగా ఎలా చెప్పగలరని అడిగినప్పుడు, నితీష్ కుమార్ మానసిక, శారీరక పరిస్థితి బాగోలేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ విషయం బీహార్ ప్రజలందరికీ తెలుసున్నారు. ప్రధానమంత్రి పక్కనే కూర్చుని ఆయన పేరునే మర్చిపోయే వ్యక్తి, జాతీయగీతం ఆలపించినప్పుడు అది జాతీయ గీతమో, ఖవ్వాలీనో తెలియని వ్యక్తి, ఏడాదిలో ఒక్కసారి కూడా మీడియాతో మాట్లాడని వ్యక్తి, తనను తాను చూసుకోలేని వ్యక్తి బీహార్‌ను ఎలా కాపాడతారు? మీకూ, నాకూ తెలిసిన ఈ విషయం ప్రధానికి, అమిత్‌షాకి తెలియదని ఎలా అనుకుంటాం? అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఎన్నికలు అయ్యేంత వరకూ నితీష్‌ను ముందుంచి, ఆ తర్వాత మరో కొత్త మంత్రిని వాళ్లు (బీజేపీ) ముందుకు తెస్తారని అన్నారు. బీహార్‌లో సొంతంగా పోటీ చేయగలమనే నమ్మకం బీజేపీకి లేనందు వల్లే ఇప్పుడే నితీష్‌ను పక్కకు తప్పించలేదన్నారు. గతంలో కూడా బీజేపీ అలా చేసింది లేదని గుర్తుచేశారు. ఆ కారణంగానే నితీష్ పైనే ఆ భారం మోపుతుందని ఆయన విశ్లేషించారు.
అలా కాకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా..
జేడీయూ మొత్తం 243 సీట్లలో 25 సీట్లకు మించి గెలుచుకోలేదని, తన అంచనా తప్పయితే తాను రాజకీయాలను తప్పుకుంటానని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. దీన్ని కూడా రాసిపెట్టుకోవచ్చన్నారు. ఎన్నికల తర్వాత జేడీయూ ఉనికే ప్రశ్నార్థకమవుతుందని, నితీష్ కుమార్ అప్రూవ్ రేటింగ్ 60 శాతం నుంచి 16-17 శాతానికి పడిపోతుందని చెప్పారు. జేడీయూకు కార్యకర్తలులేరని, ఉన్నదల్లా నితీష్ ఒక్కరేనని, అది కూడా ఇప్పుడు పోయిందని విశ్లేషించారు.
సీఎం రేసులో లేను కానీ..
ఆర్జేడీ మాజీ ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూడా తదుపరి సీఎం కారని, జన్ సురాజ్ నుంచే కొత్త సీఎం వస్తారని, వేచి చూడండని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. అయితే తాను సీఎం రేసులో లేనని, ముఖ్యమంత్రి కావడానికి తాను రాలేదని అన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడో, జాతీయ అధ్యక్షుడో కూడా కాదని, బీహార్‌లోని వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు తాను వచ్చానని, ఆ పని ఇప్పటికే మొదలైందని చెప్పారు. నితీష్ కుమార్ జిల్లాకు ఈరోజు వెళ్తున్నానని, జేడీయూ అక్కడ కూడా ఓడిపోనుందని ఆయన జోస్యం చెప్పారు.
జన్ సురాజ్ ఉద్యమంలో 1.25 కోట్ల మంది బీహార్ ప్రజలు పాల్గొన్నారని చెబుతూ తాను కింగ్‌మేకర్‌నని ఆయన స్పష్టం చేశారు. తాము గెలిచినా, గెలవకపోయినా జన్ సురాజ్ పవర్‌ఫుల్ ఫోర్స్‌గా, ప్రజావాణిగా ఆవిర్భవించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేతో కానీ, విపక్ష యూపీఏతోనూ కలిసేది లేదని, 243 స్థానాల్లోనూ పోటీ చేస్తామని, ఎవరైనా తమ పార్టీని జన్ సురాజ్‌లో కలపాలనుకుంటే ఆ పని చేయవచ్చని సూచించారు.
పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
ఎన్నికల్లో జన్‌సురాజ్ అభ్యర్థిగా పోటీ చేస్తారా అడిగినప్పుడు దీనిపై తానింకా నిర్ణయం తీసుకులేదని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
విమాన ప్రమాదం దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరి భద్రత
కోల్‌కతా లా కాలేజీ అత్యాచార ఘటన.. సెక్యూరిటీ గార్డు అరెస్టు
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి