Share News

Malegaon Blast Case: ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు ఉరి శిక్ష వేయండి

ABN , Publish Date - Apr 26 , 2025 | 05:01 AM

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ సహా ఏడుగురు నిందితులకు ఉరి శిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోర్టును కోరింది. గతంలో ఇచ్చిన క్లీన్‌చిట్‌కు విరుద్ధంగా ఇప్పుడు పూర్తిగా యూటర్న్‌ తీసుకుంది

Malegaon Blast Case: ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌కు ఉరి శిక్ష వేయండి

  • మాలేగావ్‌ కేసులో కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి

  • గతంలో ఇచ్చిన క్లీన్‌చిట్‌కు భిన్నంగా యూటర్న్‌

ముంబై, ఏప్రిల్‌ 25: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్‌ పేలుళ్ల కేసులో.. సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ సహా ఏడుగురు నిందితులకూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా)లోని సెక్షన్‌ 16 కింద మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ కోర్టుకు విజ్ఞప్తిచేసింది. ముంబై ప్రత్యేక కోర్టులో కొనసాగుతున్న ఈ కేసు విచారణ కిందటి శనివారం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన జడ్జి ఏకే లహోటీ.. తీర్పును మే 8వ తేదీకి వాయిదా వేశారు. 1389 పేజీలతో తన తుది వాదనలను సమర్పించిన ప్రాసిక్యూషన్‌.. నిందితులందరికీ మరణశిక్ష విధించాలని అందులో కోరింది. నిజానికి ఈ కేసులో నిందితులకు ఎనిమిదేళ్ల క్రితం క్లీన్‌చిట్‌ ఇచ్చిన ఎన్‌ఐఏ.. ఆ తర్వాత పూర్తి యూటర్న్‌ తీసుకోవడం గమనార్హం. కేసు వివరాల్లోకి వెళ్తే.. 2008 సెప్టెంబరు 29న మహారాష్ట్రలోని మాలేగావ్‌లో రంజాన్‌ ప్రార్థనల సమయంలో రెండు పేలుళ్లు జరిగి ఆరుగురు ముస్లింలు మరణించారు.


100 మందికి పైగా గాయపడ్డారు. ఈ కేసును తొలుత మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ విచారించి.. ప్రజ్ఞా ఠాకూర్‌, శివనరాయణ్‌ గోపాల్‌ సింగ్‌ కల్సంఘ్రా, శ్యామ్‌ భవర్లాల్‌ సాహును అరెస్టు చేసింది. ఆ ముగ్గురితో సహా.. మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎంకోకా (మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ యాక్ట్‌) కింద అభియోగాలు నమోదు చేయడంతో వారికి ఎక్కడా బెయిల్‌ దొరకలేదు. 2011లో ఎన్‌ఐఏ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. 2015లో ఎన్‌ఐఏ ఈ కేసులో సాక్షులను తిరిగి విచారించి, ప్రజ్ఞా ఠాకూర్‌ సహా మరికొందరికి క్లీన్‌చిట్‌ ఇస్తూ 2016లో చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇదే కేసులో.. లెఫ్టినెంట్‌ కర్నల్‌ పురోహిత్‌ సహా మరో 10 మందిపై ఎంకోకా చట్టం కింద దాఖలు చేసిన అభియోగాలన్నింటినీ తొలగించింది. కానీ, కోర్టు ప్రజ్ఞా ఠాకూర్‌ విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసి విచారణను కొనసాగించింది. దాదాపు 17 సంవత్సరాలపాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు 2025 ఏప్రిల్‌ 19న ముగిసింది. అయితే.. ఈ కేసులో నిందితులకు 2016లో క్లీన్‌చిట్‌ ఇచ్చిన అదే ఎన్‌ఐఏ.. ఆ తర్వాత యూటర్న్‌ తీసుకుని.. సాక్షులు 2015లో మాటమార్చారని, వారి వాంగ్మూలాలను విశ్వాసంలోకి తీసుకోలేమని.. ప్రజ్ఞాఠాకూర్‌, లెఫ్టినెంట్‌ కర్నల్‌ ప్రసాద్‌ పురోహిత్‌, సుధాకర్‌ ద్వివేది, రిటైర్డ్‌ మేజర్‌ రమేశ్‌ ఉపాధ్యాయ్‌, అజయ్‌ రహీర్కర్‌, సుధాకర్‌ చతుర్వేది, సమీర్‌ కులకర్ణికి మరణశిక్ష విధించాలని కోరింది.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 05:01 AM