Share News

Election Commission: ఓటర్ల జాబితాల తనిఖీ ఇక దేశమంతటా

ABN , Publish Date - Jul 14 , 2025 | 04:00 AM

బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ ఈసీ నిర్ణయించింది.

Election Commission: ఓటర్ల జాబితాల తనిఖీ ఇక దేశమంతటా

  • బిహార్‌ తరహాలో ఆగస్టులో చేపట్టనున్న ఈసీ

  • తొలుత అసోం, కేరళ, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరిల్లో..

  • రాష్ట్రాల్లో యంత్రాంగం క్రియాశీలం

  • బిహార్‌ జాబితాల్లో భారీగా విదేశీయులు

  • బంగ్లా, మయన్మార్‌, నేపాలీలకూ ఓట్లు

న్యూఢిల్లీ/పట్నా, జూలై 13: బిహార్లో మాదిరిగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత తనిఖీ చేపట్టాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు-నవంబరుల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు తనిఖీలు చేపట్టే అధికారం ఈసీకి ఉందని, అది దాని రాజ్యాంగ కర్తవ్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమీక్ష, తనిఖీ రాజ్యాంగవిరుద్ధమని, ఓటర్ల ఓటుహక్కును హరించేదిగా ఉందంటూ వివిధ ప్రతిపక్షాలు వేసిన పిటిషన్‌పై ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 28న ఆ పిటిషన్‌పై మరోసారి విచారణ జరుగనుంది. ఆ తర్వాత వచ్చే నెలలోనే దేశవ్యాప్తంగా ఈ తనిఖీలు నిర్వహణకు ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసే వీలుంది. ముందుగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన అసోం, కేరళ, బెంగాల్‌, తమిళనాడు, పుదుచ్చేరిల్లో ఈ ప్రక్రియ చేపడతారు. విపక్షాలు పిటిషన్‌ వేసిన మర్నాడే.. అంటే ఈ నెల 5న జాబితాల సమీక్షకు సన్నాహాలు మొదలుపెట్టాలని ఆదేశిస్తూ ఈసీ అన్ని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారు(సీఈవో)లకు లేఖ రాసింది. వచ్చే ఏడాది జనవరి 1కల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని.. 18 ఏళ్లు నిండినవారికి ఓటు హక్కు కల్పించాలని స్పష్టంచేసిందని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ వెల్లడించింది.


బంగ్లా, మయన్మార్‌, నేపాలీలకు ఓట్లు

బిహార్లో చేపట్టిన ప్రత్యేక విస్తృత తనిఖీల్లో.. పెద్దసంఖ్యలో విదేశీయులు ఉన్న ట్లు తేలింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ జాతీయుల పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉన్నాయని.. తనిఖీలు పూర్తయ్యాక తొలగిస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. గత నెల 25 నుంచి ఈ రాష్ట్రంలో తనిఖీలు మొదలయ్యాయి. 77 వేల మంది బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు).. 7.8 కోట్ల మంది ఓటర్లున్న జాబితాలను ఆగస్టు 1 నుంచి లోతుగా పరిశీలించనున్నారు. తనిఖీల అనంతరం వారి పేర్లు తొలగించి తుది జాబితాలను సెప్టెంబరు 30న ప్రచురిస్తారు. ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే డాక్యుమెంట్లు సమర్పించాలని ఈసీ ఇప్పటికే ఆదేశించింది. డాక్యుమెంట్లు చూపలేకపోతే ఓట్లు తీసేస్తారని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేయడంతో ఇందుకోసం ఆధార్‌, ఈసీ జారీచేసిన ఫొటో ఓటరు గుర్తింపు కార్డు, రేషన్‌ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Updated Date - Jul 14 , 2025 | 04:00 AM