National Herald Case ED Action: నేషనల్ హెరాల్డ్ కేసు మళ్లీ తెరపైకి
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:01 AM
నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈడీ, కాంగ్రెస్ నేతల సోనియా, రాహుల్‌గాంధీకి సంబంధించిన రూ. 661 కోట్ల స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని ప్రారంభించింది

ఏజేఎల్‌కు చెందిన రూ. 661 కోట్ల స్థిరాస్తుల స్వాధీనం!
చర్యలు ప్రారంభించిన ఈడీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. వారికి సంబంధించిన రూ.661 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను స్వాఽధీనం చేసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమాయత్తమైంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ 8లోని 5(1) నిబంధన కింద ఆ స్థిరాస్తులను తమ స్వాధీనంలోకి తీసుకుంటామని ఢిల్లీ, ముంబై, లఖ్‌నవూ ప్రాపర్టీస్ రిజిస్ట్రార్లకు నోటీసులు జారీచేసినట్లు ఈడీ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని బహదూర్‌షా జాఫర్ మార్గ్‌లోని 5ఏ-నేషనల్ హెరాల్డ్ నివాసం, ముంబైలోని బాంద్రాలో సర్వే నంబరు 341లోని ప్లాట్ నంబర్2, యూపీలోని లఖ్‌నవూలో బిజేశ్వర్‌నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ భవనానికి శుక్రవారం నోటీసులు అంటించినట్లు తెలిపింది. తాము వీటిని స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ఖాళీచేయాలని స్పష్టంచేసింది. అలాగే.. ఇక నుంచి ప్రతి నెలా ఈడీ డైరెక్టరు పేరిట అద్దె/లీజు మొత్తాన్ని బదిలీచేయాలని బాంద్రా హెరాల్డ్ హౌస్ 7,8,9 అంతస్తుల్లో ఉన్న జిందాల్ సౌత్‌వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు కూడా నోటీసులిచ్చారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక ప్రచురణ సంస్థ ఏజేఎల్. దీని యజమాని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇందులో సోనియా, రాహుల్ ప్రధాన వాటాదారులు. వారిద్దరికీ చెరో 38 శాతం షేర్లు ఉన్నాయి. 2010లో ఏజేఎల్‌లోని రూ.2 వేల కోట్ల విలువైన వాటాలను యంగ్ ఇండియన్ కేవలం రూ.50 లక్షలకే తీసుకుంది.
సోనియా, రాహుల్, నాటి కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో పాటు సుమన్ దూబే, శామ్ పిట్రోడా, యంగ్ ఇండియన్ కంపెనీ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి 2014 జూన్ 26న ప్రైవేటు ఫిర్యాదుచేశారు. పటియాలా హౌస్ కోర్టుల మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దానిని పరిగణనలోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను ఢిల్లీ హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు కూడా సమర్థించాయి. దరిమిలా ఈడీ 2021లో రంగంలోకి దిగి పీఎంఎల్‌ఏ చట్టం కింద దర్యాప్తుచేపట్టింది. సోనియా, రాహుల్‌ను పలు దఫాలు విచారించింది. 2 వేల కోట్ల విలువైన ఆస్తులను రూ.50 లక్షలకే టేకోవర్ చేయడం ద్వారా వారు ఆర్థిక లబ్ధి పొందారని తేల్చింది. అంతేగాక.. బోగస్ విరాళాల రూపంలో రూ.18 కోట్లు, రూ.38 కోట్ల అద్దె చెల్లించినట్లుగా బోగస్ అడ్వాన్సు చూపారని.. అలాగే రూ.29 కోట్ల మేర బోగస్ ప్రకటనలు కూడా చూపారని వెల్లడించింది. సదరు మూడు ప్రాపర్టీల ద్వారా రూ.988 కోట్ల మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని తెలిపింది. వీటితోపాటు రూ.90.2 కోట్ల విలువైన షేర్లను 2023 నవంబరులో ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..