PM Modi Maldives Trip: 23 నుంచి మోదీ విదేశాల పర్యటన
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:12 AM
ప్రధాని మోదీ బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు..

న్యూఢిల్లీ, జూలై 20: ప్రధాని మోదీ బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు యూకే, మాల్దీవుల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదరనుంది. ముందుగా ఈనెల 23, 24 తేదీల్లో ప్రధాని యూకేలో పర్యటిస్తారు. అక్కడ బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో విస్తృతస్థాయి చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకం చేస్తారు. యూకే పర్యటన తర్వాత మోదీ మాల్దీవులకు వెళ్తారు. అక్కడ 26న జరిగే 60వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు 2023లో అధికారంలోకి వచ్చాక మోదీ అక్కడికి వెళ్లడం ఇదే మొదటిసారి. గతేడాది మోదీపై, లక్షదీవులపై మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు, చైనా అనుకూల వైఖరి వల్ల ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులతో మెరుగైన దౌత్యసంబంధాలు, పరస్పర సహకారానికి ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ భావిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News