PM Modi: భారత్‌లో 2500కు పైగా పార్టీలు
ABN , Publish Date - Jul 04 , 2025 | 03:14 AM
పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు...

ఘనా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ
ఆశ్చర్యం వ్యక్తం చేసిన అక్కడి ఎంపీలు
మోదీకి ‘ది స్టార్ ఆఫ్ ఘనా’తో సత్కారం
అక్రా, జూలై 3: పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. ఆ దేశ పార్లమెంట్‌లో ప్రజాస్వామ్యం గురించి గురువారం ప్రసంగించారు. ఘనాలో పర్యటించడం తనకు దక్కిన గౌరవమన్నారు. భారత్‌లో 2500కు పైగా రాజకీయ పార్టీలున్నాయని ఆయన చెప్పగా.. ఘనా ఎంపీలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది చూసి ప్రధా ని మళ్లీ అదే విషయాన్ని గట్టిగా ప్రస్తావించగా.. అంతా చిరునవ్వులు చిందించారు. భారత్‌లో ప్రజాస్వామ్యం అనేది ఓ వ్యవస్థ మాత్రమే కాదని.. ప్రాథమిక విలువల్లో భాగమన్నారు.
భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా ఆయన అభివర్ణించారు. ‘మా దేశంలో 22 పార్టీలు వివిధ రాష్ట్రాలను పాలిస్తున్నాయి. 22 అధికారిక భాషలున్నాయి. వేల కొద్ది మాండలికాలున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు మోదీని ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా’ అవార్డుతో సత్కరించారు. ఇక పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య పరిశోధన, అభివృద్ధి, ఔషధ తదితర రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి.