షమీ మహాపాపి, నేరగాడు!
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:52 AM
భారత జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ రంజాన్ నెలలో ఉద్దేశపూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ అన్నారు.

భారత జట్టు ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్ షమీపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ చీఫ్ షహబుద్దీన్ విమర్శలు
న్యూఢిల్లీ, మార్చి 6: భారత జట్టు పేస్ బౌలర్ మహమ్మద్ షమీ రంజాన్ నెలలో ఉద్దేశపూర్వకంగా రోజా (ఉపవాసం)ను వదిలేయడం ద్వారా మహా పాపానికి ఒడిగట్టారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరెల్వీ అన్నారు. చాంపియన్స్ ట్రోపీలో భాగంగా మార్చి 4న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో షమీ కూల్ డ్రింక్ తాగడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇస్లాంలో రోజా అనేది ఓ బాధ్యత అని.. మ్యాచ్ సందర్భంగా ఉపవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా షమీ నేరానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
షమీ చర్య ఇస్లాం నిర్దేశించిన సూత్రాలకు వ్యతిరేకం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రోజాను కొనసాగించకుండా వదిలేసిన షమీ ఓ నేరగాడు. తన చర్యలపై ఆయన దేవుడికి కచ్చితంగా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది’ అని షహబుద్దీన్ వ్యాఖ్యానించారు. అయితే షమీకి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ మెంబర్ మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగీ మహ్లీ మద్దతుగా నిలిచారు. క్రికెటర్ షమీ ప్రస్తుతం పర్యటనలో ఉన్నారని.. ప్రయాణాల్లో ఉన్నవారికి రోజా నుంచి వైదొలిగేందుకు మినహాయింపు ఉంటుందన్నారు. ఇక షమీకి పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా మద్దతు పలికారు.