Pahalgam Terror Attack: సిగ్గుతో తలవంచుకోవాలి.. పహల్గాం దాడిపై జమ్మూకశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసనలు
ABN , Publish Date - Apr 23 , 2025 | 04:34 PM
పహల్గాం ఘటనకు నిరసనగా 35 ఏళ్లలో తొలిసారి జమ్మూకశ్మీర్ మూతపడింది. ప్రజలంతా జమ్మూకశ్మీర్ షట్‌డౌన్‌లో పాల్గొనాలంటూ మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లలోనూ ప్రకటిస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు.

పహల్గాం: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది టూరిస్టులను కిరాతకం పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల చర్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద ముఠాల పీచం అణచాలంటూ ముక్తకంఠతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పహల్గాం ఘటనకు నిరసనగా 35 ఏళ్లలో తొలిసారి జమ్మూకశ్మీర్ మూతపడింది. ప్రజలంతా జమ్మూకశ్మీర్ షట్‌డౌన్‌లో పాల్గొనాలంటూ మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లలోనూ ప్రకటిస్తుండగా, ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనల్లో పాల్గొంటున్నారు.
PahalgamTerroristAttack: యుద్ధంలో భారత్ ముందు పాక్ ఎంతకాలం నిలువగలదు?
మూతపడిన వహల్గాం.. వెల్లువెత్తిన సంఘీభావం
మంగళవారంనాడు ఉగ్రవాదుల మారణహోమంతో టూరిస్ట్ హాట్‌స్పాట్ ఒక్కసారిగా మూగబోయింది. పహల్గాంలో దుకాణాలన్నీ పూర్తిగా మూతపడ్డాయి. దుకాణదారులు, హోటలీర్స్ సైతం పహల్గాంలో బుధవారంనాడు జరిగిన నిరసనల్లో పెద్దఎత్తున పాల్గొన్నారు. ''హిందూస్థాన్ జిందాబాద్', ''నేను భారతీయుడిని'' అంటూ నినాదాలు మిన్నంటాయి. హహల్గాంలో చిక్కుకుపోయిన టూరిస్టులకు పూర్తి సహకారం అందిస్తామని, 15 రోజుల పాటు ఉచిత వసతి కల్పిస్తామని పలువురు ప్రదర్శకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.
మానవత్వంపై దాడి
టూరిస్టులపై ఉగ్రవాదుల దాడి మానవత్వంపై జరిగిన దాడిగా హోటల్ యజమాని అసిఫ్ బుర్జూ పేర్కొన్నారు. ''ఇది టూరిజానికి, ఎకానమీకి సంబంధించిన వ్యవహారం కాదు, మానవత్వానికి మచ్చ. అందరూ సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం'' అని ఆయన అన్నారు. టూర్జిస్టుల తప్పేమిటి? ఇక్కడ పర్యటించడానికి వచ్చారు. వారి కుటుంబాల ఆవేదన గురించే మేమంతా ఆలోచిస్తున్నాం'' అని అన్నారు. పర్యాటకులు, వారి కుటుంబాలకు తాము సంఘీభావం తెలుపుతున్నట్టు మరొక హోటలీర్ వ్యాఖ్యానించారు.
ఆర్మీకి అండగా ఉంటాం...
ఉగ్రదాడులకు ప్రతిగా ఆర్మీ తీసుకునే చర్యలకు తామంతా అండగా నిలుస్తామని మరో నిరసనకారుడు తెలిపారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని, అవసరమైతే తామంతా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఆర్మీకి బాసటగా నిలుస్తామని, మానవతావాదానికి అండగా ఉంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..