Mamata Kulkarni: మహామండలేశ్వర్ పదవికి రాజీనామా.. ఇన్‌స్టాలో వెల్లడించిన మమతా కులకర్ణి
ABN , Publish Date - Feb 10 , 2025 | 05:12 PM
మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు.

న్యూఢిల్లీ: కిన్నర్ అఖాడా మహామండలేశ్వర్ పదవికి తాను రాజీనామా చేసినట్టు బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (Mamata Kulkarni) అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోమవారంనాడు ఒక వీడియోను సామాజిక మాధ్యమంలో ఆమె షేర్ చేశారు. మమతా కులకర్ణి నియామకంపై ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, కిన్నర్ అఖారా వ్యవస్థాపకుడు రిషి అజయ్ దాస్ మధ్య విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఆమె తాజా నిర్ణయం తీసుకున్నారు. తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించారు.
Yamuna Curse: యమునా శాపం తగిలింది.. అతిషితో ఎల్జీ
''నేను (మహామండలేశ్వర్ మమత నందగిరి) నా పదవికి రాజీనామా చేశాను. ఈ విషయంలో రెండు గ్రూపులు గొడవ పడటం సరికాదు. 25 ఏళ్లుగా నేను సాధ్విగా ఉన్నాను, ఇకముందు కూడా అలాగే కొనసాగుతాను. మహామండలేశ్వర్‌గా నన్ను నియమించడంపై గొడవ పడటం సరికాదు. 25 ఏళ్ల క్రితమే నేను బాలీవుడ్‌ను విడిచిపెట్టాను. అప్పట్నించీ అందరికీ, అన్నింటికీ దూరంగా ఉంటూ వచ్చాను. నా గురించి ప్రజలు రకరకాలుగా స్పందించడం చూశాను. శంకరాచార్య కావచ్చు, మరొకరు కావచ్చు...నన్ను మహామండేలశ్వర్‌గా నియమించడం కొందరికి అభ్యంతరకరంగా తోచి ఉండవచ్చు. నేను కైలాస్‌కో, మానస సరోవర్‌కో వెళ్లనక్కర లేదు. 25 ఏళ్ల తపస్సుతో విశ్వం నా కళ్లముందే ఉంది" అని ఆ వీడియోలో మమతా కులకర్ణి వివరించారు.
మహామండలేశ్వర్‌గా మమతా కులకర్ణిని నియమించడంపై అఖారా సాధువులు పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై రిషి అజయ్ దాస్ చర్యలు తీసుకున్నారు. మమతా కులకర్ణి, లక్ష్మీనారాయమఅ త్రిపాఠిలను పదవుల నుంచి తొలగించారు. దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మహామండలేశ్వర్ పదవి నుంచి తనను తొలగించడంపై లక్ష్మీనారాయణ్ త్రిపాఠి అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖారా నుంచి 2017లో బహిష్కృతుడైన అజయ్ దాస్ తనను పదవి నుంచి తొలగించడం ఏమిటని ఆయన నిలదీశారు.