Share News

Mamata Banerjee: భాషా ఉగ్రవాదంపై ఉద్యమం!

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:17 AM

దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీల మీద దాడులు జరుగుతున్నాయని, అది భాషా

Mamata Banerjee: భాషా ఉగ్రవాదంపై ఉద్యమం!

  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై వివక్ష

  • పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ ధ్వజం

బోల్‌పూర్‌, జూలై 28: దేశవ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీల మీద దాడులు జరుగుతున్నాయని, అది భాషా ఉగ్రవాదంతో సమానమని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత ధ్వజమెత్తారు. ‘వివిధ రాష్ట్రాలకు వలస వెళ్లిన బెంగాలీలను ఓటరు లిస్టులోంచి తొలగించి, ఎన్నార్సీ (దేశ పౌరుల జాబితా)ని దొడ్డిదారిన అమలు చేయటానికి కేంద్రం, ఎన్నికల సంఘం కుట్ర పన్నుతున్నాయి. నేను ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాగానీ.. బెంగాలీ అస్తిత్వాన్ని లాక్కోవటానికి ఎవర్నీ అనుమతించను’ అని పేర్కొన్నారు. తాను జీవించి ఉన్నంతకాలం బెంగాల్‌లో ఎన్నార్సీని అమలు చేయనియ్యబోనని, నిర్బంధ శిబిరాలను ఏర్పాటు కానివ్వబోనని మమత స్పష్టం చేశారు. బెంగాలీల మీద వివక్షకు వ్యతిరేకంగా మమత సోమవారం రాష్ట్రవ్యాప్త భాషా ఉద్యమాన్ని పశ్చిమ బెంగాల్‌లోని బోల్‌పూర్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘మాకు ఏ భాషతోనూ శతృత్వం లేదు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశానికి పునాది. కానీ, మా భాషను సంస్కృతిని ధ్వంసం చేయటానికి చూస్తే మాత్రం మేం శాంతియుతంగా, శక్తిమంతంగా, రాజకీయంగా ఎదుర్కొంటాం’ అని తెలిపారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్రం తరఫున ఓ మాజీ కేంద్రమంత్రి అసలైన ఓటర్లను కూడా ఓటరు లిస్టులోంచి తొలగిస్తున్నారని, బెంగాలీలు తమ సొంతదేశంలో నిర్వాసితులు కావటాన్ని తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. దేశ స్వాతంత్ర్యోద్యమానికి, అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన బెంగాల్‌.. తన సొంత అస్తిత్వం కోసం కూడా పోరాడగలదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వేధింపులకు గురవుతున్న బెంగాలీలు తిరిగి సొంతరాష్ట్రానికి రావాలని మమత పిలుపునిచ్చారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:17 AM