Mamata Banerjee: మా వాళ్లను వేధిస్తున్నారు.. పీఎం దృష్టికి తీసుకువెళ్తా
ABN , Publish Date - Jun 24 , 2025 | 08:02 PM
బెంగాలీ మాట్లాడే 300 నుంచి 400 మంది వలస కార్మికులను సరైన డాక్యుమెంట్లు చూపించినప్పటికీ రాజస్థాన్‌లోని ఒక భవనంలో ఈరోజు నిర్బంధించినట్టు తనకు సమాచారం ఉందని మమతా బెనర్జీ చెప్పారు.

కోల్‌కతా: బెంగాలీ మాట్లాడే ప్రజల పట్ల కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరిపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మండిపడ్డారు. బెంగాలీ భాష మాట్లాడేవాళ్లపై బంగ్లాదేశీయులంటూ ముద్ర వేసి, వేధిస్తున్నారని ఆరోపించారు. దీనిని ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. అసెంబ్లీ ఛాంబర్‌లో మంగళవారంనాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, బెంగాలీ మాట్లాడే 300 నుంచి 400 మంది వలస కార్మికులను సరైన డాక్యుమెంట్లు చూపించినప్పటికీ రాజస్థాన్‌లోని ఒక భవనంలో ఈరోజు నిర్బంధించినట్టు తనకు సమాచారం ఉందని చెప్పారు.
'రబీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద వంటి ప్రముఖులు మాట్లాడిన బంగ్లా భాషలో మాట్లాడటం నేరమా? ఈ పరిణామం గురించి ప్రధాన మంత్రి మోదీకి తెలియదని అనుకుంటున్నాను. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తాను' అని మమతా బెనర్జీ చెప్పారు. రాజస్థాన్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లో గతంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు. రాజస్థాన్‌లో చోటుచేసుకున్న తాజా ఘటనను ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో తమ చీఫ్ సెక్రటరీ మాట్లాడినట్టు తెలిపారు. 1971 వరకూ ఎవరైతే వచ్చారో వారంతా భారతీయ పౌరులేనని ఆమె చెప్పారు. వివిధ రాష్ట్రాల నుంచి బెంగాల్‌లో పనిచేస్తున్న వలస కార్మికుల సంఖ్య 1.5 కోట్ల వరకూ ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.
బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను వేధిస్తున్న విషయం హోం మంత్రి అమిత్‌షాకు తెలియదా అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ప్రస్తుతం 22 లక్షల మంది బెంగాల్ వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. బెంగాల్ ప్రజలు వెనక్కి వచ్చి ఇక్కడే పనులు చేసుకోవాలని తాను తరచు కోరుతూనే ఉన్నానని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతుండటం విచారకరమని, బెంగాల్‌లో ఏదైనా ఊహించని ఘటన జరిగితే పది కమిషన్లను పంపుతారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలు, మైనారిటీలపై దాడులు జరిగితే మాత్రం మిన్నకుండిపోతారని ఆక్షేపణ తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల ఆరోపణలపై ఈసీ నుంచి రాహుల్‌కు పిలుపు
బ్లాక్ బాక్స్ ఊహాగానాలపై కేంద్ర మంత్రి క్లారిటీ
For National News And Telugu News