Share News

Mahua Moitra: ఈసీఐ ఓటర్ల జాబితా సమీక్షపై సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:36 PM

ఈసీఐ బీహార్‌లో చేపబట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష అమలును తక్షణం ఆపివేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈసీఐ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశించాలని మహువా మొయిత్రా తన పిటిషిన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.

Mahua Moitra: ఈసీఐ ఓటర్ల జాబితా సమీక్షపై సుప్రీంకోర్టుకు మహువా మొయిత్రా

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) బీహార్‌ (Bihar)లో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష (Special Intensive Revision- SIR)ను తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) సవాలు చేశారు. సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేశారు. బీహార్‌లో చివరిసారిగా 2003లో ఎస్ఐఆర్ నిర్వహించారు.


ఈసీఐ బీహార్‌లో చేపబట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సమీక్ష అమలును తక్షణం ఆపివేయాలని, ఇతర రాష్ట్రాల్లోనూ ఈసీఐ ఇలాంటి ఆదేశాలు ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశించాలని మహువా మొయిత్రా తన పిటిషిన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈసీఐ ఆదేశం పక్షపాతంతో కూడుకున్నదని, రాజ్యాంగవిరుద్ధమని, పేదలు, మహిళలు, వలస ఓటర్లను ఓటింగ్ ప్రక్రియ నుంచి మినహాయించేందుకు ఉద్దేశించినదని ఆమె పేర్కొన్నారు.


కాగా, దీనికి ముందు ఎస్ఐఆర్ కోసం ఈసీఐ ఇచ్చిన ఆదేశాలను అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఇందువల్ల లక్షలాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని తెలిపింది. ఎన్నికలు మరో మూడు, నాలుగు నెలల్లో ఉండగా తక్కువ సమయంలో మరోసారి విస్తృత సమీక్ష జరపాలంటూ ఈసీఐ ఆదేశాలు ఇచ్చిందని, ఇందుకు ఎలాంటి కారణాలు లేవని పేర్కొంది. తన పౌరసత్వం గురించి మాత్రమే కాకుండా తన తల్లిదండ్రుల పౌరసత్వాన్ని కూడా పత్రాల ద్వారా నిరూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఓటరు పేరును జాబితా నుంచి తొలగిస్తారని తెలిపింది. ఆ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, వలస కార్మికులు మూడు కోట్ల మంది ఓటు హక్కు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేసింది.


ఈసీఐ ఏమంటోంది?

బీహార్‌లో అనర్హత కలిగిన ఓటర్లను తొలగించి, అర్హులైన వారిని జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక విస్తృత సమీక్ష జరపాలని జూన్ 24న ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. శ్రీఘ్రగతిని అర్బనైజేషన్ చోటుచేసుకోవడం, తరచు జరుగుతున్న వలసలు, కొత్తగా అర్హులైన యువ ఓటర్లు, మరణాల వివరాలు రిపోర్ట్ చేయకపోవడం, అక్రమ విదేశీ వలసదారుల పేర్లు చేర్చడం వంటి కారణాలను ఈసీ ప్రస్తావించింది. ఎన్నికల జాబితా సమగ్రత, కచ్చితత్వం కోసం ఈ సమీక్ష అవసరమని తెలిపింది. ఓటర్ వెరిఫికేషన్ కోసం బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని తెలిపింది.


ఇవి కూడా చదవండి..

బీహార్‌ను నేరాల రాజధానిగా మార్చేశారు

ఆ బంగ్లా తక్షణం ఖాళీ చేయండి.. మాజీ సీజేఐకి సుప్రీంకోర్టు నోటీసులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 03:36 PM