Madras High Court: ఫోన్ ట్యాపింగ్ వ్యక్తి గోప్యతా హక్కు ఉల్లంఘనే
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:55 AM
ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది.

మద్రాసు హైకోర్టు స్పష్టం
చెన్నై, జూలై 2(ఆంధ్రజ్యోతి): ప్రజా అత్యవసర పరిస్థితి లేదా ప్రజా ప్రయోజనాల విషయంలో తప్ప ఇతరత్రా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడడం వ్యక్తి ప్రాథమిక గోప్యతా హక్కు ఉల్లంఘనేనని మద్రాస్ హైకోర్టు తేల్చి చెప్పింది. నేరాలు గుర్తించడానికి ఒక వ్యక్తి లేదా వ్యక్తుల ఫోన్ సంభాషణలు రహస్యంగా వినేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రాష్ట్ర భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, తీవ్ర నేర ప్రేరేపణ వంటి వాటిని నిరోధించడం కోసం అథారిటీ సంతృప్తి చెందిన తర్వాతే ట్యాపింగ్ ఉత్తర్వులను జారీ చేయాల్సివుంటుందని స్పష్టం చేసింది. టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2), టెలిగ్రాఫ్ రూల్స్ 1951లోని రూల్ 419-ఏ కింద ఒక అవినీతి కేసుకు సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓ ప్రైవేటు కంపెనీ ఎండీ పి.కిశోర్ హైకోర్టులో వేశారు.
దాని విచారణ సందర్భంగా బుధవారం న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 5(2) పరిధిని విస్తరించాలన్న కేంద్రం వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. అంతేగాక చట్టంలోని సెక్షన్ 5(2) కింద నిర్దేశించిన లక్ష్మణ రేఖను దాటలేరని తేల్చిచెప్పింది. ప్రస్తుత కేసులో అధికారులు ట్యాపింగ్ విషయాన్ని సమీక్ష కమిటీ ముందు ఉంచలేదని, అందువల్ల నిబంధనల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. చట్టంలోని సెక్షన్ 5(2), నిబంధనలలోని నిబంధన 419-ఎ(17)ని ఉల్లంఘించి ఈ విషయాన్ని సేకరించినందున, ఆ విషయాన్ని ఏ ఉద్దేశానికైనా ఉపయోగించరాదని ఆదేశించిన ధర్మాసనం.. పిటిషనర్ ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి కేంద్రం గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది.