Hanuman Jayanti హనుమన్ జయంతి శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాని నిందితుడితో సహా 9 మంది అరెస్టు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:34 PM
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.

గుణ: మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని గుణ (Guna)లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో (stone pelting) పోలీసు బలగాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక మసీదుకు సమీపంలో శనివారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కొద్దిసేపటల్లోనే సద్దుమణిగిందని, ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొందని జిల్లా యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.
Maharashtra: జైల్లో ఉరేసుకున్న మైనర్ బాలిక హత్యాచార నిందితుడు
ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ అరెస్టు
కాగా, ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్‌ను సైతం పోలీసులు అరెస్టు చేశారు. స్థానికుల సమాచారం ప్రకారం, విక్కీ పఠాన్ కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేస్తుంటాడు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 6వ నెంబర్ వార్డు నుంచి పోటీ చేశాడు. కాగా, విక్కీ అరెస్టును ఆయన భార్య నజ్మా ఖండించింది. రాత్రి వేళ పోలీసులు తమ ఇంటికి వచ్చి తన భర్తను, కుమారుడిని కొట్టి అరెస్టు చేశారని ఆరోపించింది. వారిని విడిచిపెట్టకుంటే తాను ప్రాణాలు తీసుకుంటానని హెచ్చరించింది. విక్కీకి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని, గతంలో తమ ప్రాంతం నుంచి కౌన్సిలర్‌గా ఆయన పోటీ చేశారని తెలిపింది.
సింధియా ఆరా..
హనుమాన్ జయంతి ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన, ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, స్థానికి ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ఆరా తీశారు. ఎస్పీతో సహా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హింసకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా, హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ రాళ్లు రువ్వడానికి దారితీసినట్టు తెలుస్తోందని, అయితే అసలు కారణంపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడటం కానీ, ఆస్తినష్టం కానీ జరగలేదని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి