Rohini Acharya: రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన
ABN , Publish Date - Nov 15 , 2025 | 04:42 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
పాట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారంనాడు ప్రకటించారు. దీనితో పాటు తన కుటుంబంతో సంబంధాలను కూడా తెంచుకుంటున్నట్టు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి పరాజయం పాలైన మరుసటి రోజే రోహిణి ఆచార్య ఈ ప్రకటన చేయడం సంచలనమైంది. దీంతో ఆర్జేడీ కుటుంబంలో అంతర్గత కలహాలే ఇందుకు దారితీసుండవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు రోహిణి ఆచార్య చేసిన ప్రకటనలో సంజయ్ యాదవ్, రమీజ్ అనే ఇద్దరిని కూడా ఆమె ప్రస్తావించారు. 'నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు. నా కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నాను. సంజయ్ యాదవ్, రమీజ్ అడిగింది కూడా ఇదే. నేను ఈ నిందనంతా స్వీకరిస్తున్నాను' అని ఆ ట్వీట్‌లో రోహిణి ఆచార్య పేర్కొన్నారు.
బిహార్ ఎన్నికల ఫలితాల తర్వాత కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కలహాలు, పార్టీ ఓటమికి రోహిణి ఆచార్యను బాధ్యురాలిని చేస్తూ ఆమెపై ఒత్తిడి తేవడం తాజా రాజీనామాకు కారణం కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి ముందు లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కూడా పార్టీ నుంచి, కుటుంబం నుంచి లాలూప్రసాద్ బహిష్కరించారు. దీంతో తేజ్ ప్రతాప్ సొంతంగా జన్‌శక్తి జనతాదళ్ (JJD) పార్టీని ఏర్పాటు చేసి బిహార్ ఎన్నికల్లో మహువా నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆయనతో పాటు పార్టీ నుంచి పోటీ చేసిన 22 మంది అభ్యర్థులు కూడా ఓటమిని చవిచూశారు.
ఇవి కూడా చదవండి..
ఆర్జేడీకి ఓట్లు... బీజేపీ, నితీష్‌కు సీట్లు
కేంద్ర మాజీ మంత్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..