Maha Kumbh 2025: కుంభమేళాకు అర్థమే లేదు.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 16 , 2025 | 03:37 PM
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనకు రైల్వే తప్పిదమే కారణమని, దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు.

పాట్నా: మహాకుంభమేళా (Mahakumbh 2025)పై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు అర్థమే లేదని (meaningless) అని వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించిన ఘటనకు రైల్వే తప్పిదమే కారణమని, దీనికి బాధ్యత వహించి రైల్వే మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Stampede Incident.. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. మృతులకు పరిహారం..
''తొక్కిసలాట ఘటన చాలా కలవరపాటు కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదనే విషయాన్ని ఆ ఘటన బహిర్గతం చేస్తోంది. దీనికి బాధ్యత వహించిన రైల్వే మంత్రి రాజీనామా చేయాలి. ఇది పూర్తిగా రైల్వేల వైఫల్యం'' అని లాలూ వ్యాఖ్యానించారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు లెక్కకు మిక్కిలిగా ప్రజలు తరలివస్తుండటంపై అడిగినప్పుడు "కుంభ్‌కు అర్థమే లేదు, ఇది పనికిరానిది" అని సమాధామిచ్చారు.
లాలూ వ్యాఖ్యలపై బీజేపీ ఆక్షేపణ
కుంభమేళాకు అర్థమే లేదంటూ లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. హిందూ మతం పట్ల ఆర్జేడీ ఆలోచనా విధానానికి లాలూ వ్యాఖ్యలే నిదర్శనమని బీజేపీ బీహార్ విభాగం ప్రతినిధి మనోజ్ శర్మ అన్నారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే లాలూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఆర్జేడీ నేతలు హిందువుల మనోభావాలను అవమానించడం పరిపాటిగా మారిందని విమర్శించారు.
కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులతో శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మృతులలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు. 14,15 ఫ్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి...
Maharashtra: మహారాష్ట్రలో లవ్ జిహాద్ నియంత్రణకు చట్టం!
Ranveer Allahbadia: చంపుతామంటూ బెదిరిస్తున్నారు.. ఇన్‌స్టా పోస్ట్‌లో రణ్‌వీర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.