Kolkata Law Student Incident: ప్లాన్ ప్రకారమే లా విద్యార్థినిపై అత్యాచారం.. వెలుగులోకి కొత్త విషయాలు
ABN , Publish Date - Jun 30 , 2025 | 05:57 PM
లా విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో కీలక నిందితుడైన మిశ్రాపై గతంలో కాళీఘాట్, కస్బా, అలిపోర్, హరిదేవ్‌పూర్, టోలీగంజ్ పోలీసు స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలుస్తోంది. లా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన మిశ్రా అదే కాలేజీలో కాజువల్ బేసిస్‌లో పని చేస్తున్నాడు.

కోల్‌కతా: దక్షిణ కోల్‌కతాలోని లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కీలక నిందితుడైన మనోజిత్ మిశ్రా గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. మిశ్రాకు, అతనికి సహకరించిన ఇద్దరు నిందితులు ప్రతిమ్ ముఖర్జీ, జైద్ అహ్మద్‌కు చాలాకాలంగా కాలేజీలో విద్యార్థినులను వేధించిన పూర్వ చరిత్ర ఉంది. అత్యాచార బాధితురాలు తొలిరోజు కాలేజీలో అడుగుపెట్టినప్పుడు కూడా ఆమెను వేధించారు. తాజా ఘటనకు ముందు కూడా ఆమెను వేధించి రికార్డు చేసిన దృశ్యాలతో బ్లాక్‌మెయిల్ చేయాలని ప్రయత్నాలు చేసినట్టు పోలీసులు తాజాగా వెల్లడించారు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ మొత్తం వ్యవహారం జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ముగ్గురు నిందితులు మొబైల్ ఫోన్ల ద్వారా పలువురు విద్యార్థినులను వేధించే వారని, వాటితో తరచూ బ్లాక్‌మెయిల్ చేసేవారని పోలీసులు గుర్తించారు. న్యాయ విద్యార్థినిపై జూన్ 25న అత్యాచారం జరిగినప్పటి వీడియో క్లిప్‌ను ఎవరికైనా షేర్ చేశారా? అనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.
మిశ్రాపై పలు పీఎస్‌లలో ఎఫ్ఐఆర్‌లు
లా విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో కీలక నిందితుడైన మిశ్రాపై గతంలో కాళీఘాట్, కస్బా, అలిపోర్, హరిదేవ్‌పూర్, టోలీగంజ్ పోలీసు స్టేషన్లలో కూడా ఎఫ్ఐఆర్‌లు నమోదైనట్టు తెలుస్తోంది. లా కాలేజీ పూర్వవిద్యార్థి అయిన మిశ్రా అదే కాలేజీలో కాజువల్ బేసిస్‌లో పని చేస్తున్నాడు. కాంట్రాక్ట్ బేస్‌పై 45 రోజుల క్రితం అతన్ని కాలేజీ గవర్నింగ్ బాడీ నియమించినట్టు వైస్ ప్రిన్సిపాల్ నయన ఛటర్జీ తెలిపారు. గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్‌గా టీఎంసీ శాసనసభ్యుడు అశోక్ కుమార్ దేబ్ ఉన్నారు. అయితే మిశ్రా నియామకంపై తాను సిఫారసు చేయలేదని దేబ్ తెలిపారు.
కాగా, లైంగిక వేధింపులు, దాడి, విధ్వంసం, దొంగతనం వంటి పలు కేసుల్లో మిశ్రాపై గతంలో ఛార్జిషీట్లు నమోదయ్యాయని, అతనొక హిస్టరీ షీటర్ అని కథనాలు వెలువడుతున్నాయి. 2019లో కాలేజీ ఆవరణలోనే ఒక అమ్మాయి డ్రెస్ చించాడని ఛార్జిషీటు నమోదైంది. అదే సంవత్సరం న్యూఇయర్ సందర్భంగా హరిదేవ్‌పూర్‌లో ఒక ఫ్రెండ్ ఇంట్లోంచి బంగారు గొలుసు, మ్యూజిక్ సిస్టం, పెర్‌ఫ్యూమ్ దొంగిలించాలనే ఆరోపణలూ అతనిపై ఉన్నాయి. 2022లో కస్బా ఏరియాలో ఓ మహిళను వేధించాడు. 2024 మేలో గార్డుపై దాడి చేసి, క్యాంపస్‌లో ఆస్తులను ధ్వంసం చేశాడంటూ కాలేజీ యాజమాన్యం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కాళీ ఘాట్‌లోని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మిశ్రా తండ్రి ఒక ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. అయితే మిశ్రా రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం, తరచూ గొడవలు పడుతుండటం కారణంగా ఏడాదిగా అతనికి దూరంగా ఉంటున్నట్టు అతని తండ్రి రాబిన్ మిశ్రా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
లలిత్ మోదీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఐదేళ్లు పక్కా... సీఎం, డిప్యూటీ సీఎం ఐక్యతారాగం
For National News And Telugu News