Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి.. ఖర్గే డిమాండ్
ABN , Publish Date - Oct 31 , 2025 | 04:34 PM
సర్దార్ పటేల్ అప్పట్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను మల్లికార్జున్ ఖర్గే ప్రస్తావిస్తూ, మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్టు తెలిపారు.
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మరోసారి డిమాండ్ చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కూడా ఒకసారి నిషేధం విధించారని ఆయన వాదించారు. శుక్రవారంనాడిక్కడ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో ఎక్కువగా శాంతిభద్రతల పరిస్థితి తలెత్తడానికి బీజేపీ-ఆర్ఎస్ఎస్ కారణమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. పటేల్ హయాంలో నిషేధం విధిస్తే 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, ఇప్పుడు మళ్లీ ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించాలని అన్నారు. కశ్మీర్ మొత్తాన్ని దేశంలో కలపాలని సర్దార్ పటేల్ కోరుకున్నారని, అందుకు అప్పటి ప్రధాని నెహ్రూ నిరాకరించారని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఖర్గే తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సర్దార్ పటేల్ అప్పట్లో జన్‌సంఘ్ పార్టీ సంస్థాపక అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి రాసిన లేఖను ఖర్గే ప్రస్తావిస్తూ, మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన పరిస్థితిని ఆర్ఎస్ఎస్ సృష్టించిందని ఆ లేఖలో పటేల్ పేర్కొన్నట్టు తెలిపారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ మధ్య విభేదాలున్నట్టు చిత్రిస్తూ బీజేపీ చరిత్రను వక్రీకరించిందని ఖర్గే తప్పుపట్టారు. అయితే నెహ్రూ, పటేల్ మధ్య చక్కటి సంబంధాలు ఉండేవని, ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకునే వారని తెలిపారు.
అక్టోబర్ 31న సర్దార్ పటేల్ జయంతి అయితే, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి అని, వీరిద్దరూ గొప్ప నేతలని ఖర్గే కొనియాడారు. పటేల్ ఉక్కు మనిషి అయితే, ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, ఇద్దరూ దేశానికి ఎంతో సేవ చేశారని, దేశ ఐక్యతకు పాటుపడ్డారని అన్నారు. 'ఇది కాంగ్రెస్ చరిత్ర... కాంగ్రెస్ కంట్రిబ్యూషన్' అని ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్ నయవంచన.. బీజేపీ
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. కాంగ్రెస్ పార్టీ పటేల్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని తప్పుపట్టింది. పటేల్ వారసత్వాన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌పై దాడికి ఆయన పేరును వాడుకుంటోందని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఆరోపించారు. 'ఐఎన్‌సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు. ఇండియన్ నాజీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా ఆర్ఎస్ఎస్‌పై నిషేధాన్ని కోర్టు ఎత్తివేసింది. ఆర్ఎస్ఎస్ రాజకీయేతర సంస్థ అని, ఆ సంస్థ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పాల్గొనవచ్చని కోర్టు చెప్పింది. ఇది సహించలేని కాంగ్రెస్ పార్టీ.. పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ, ఎంఐఎంలకు బాసటగా ఉంటూ దేశ సంక్షేమం కోసం పాటుపడుతున్న ఆర్ఎస్ఎస్‌పై విషం చిమ్ముతోంది' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
కేజ్రీవాల్ కోసం మరో శీష్ మహల్.. ఫోటో షేర్ చేసిన బీజేపీ
డిప్యూటీ సీఎం సంచలన కామెంట్స్.. ఎంపీ తేజస్వీ సూర్య.. ఓ వేస్ట్ మెటీరియల్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి