Hostage in Mumbai Studio: ఆడిషన్స్ పేరుతో పిలిచి.. బందీలుగా..!
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:33 AM
ఆడిషన్స్ పేరుతో స్టూడియోకు రప్పించి 17 మంది పిల్లలు 13 నుంచి 17 ఏళ్ల వయసు, మరో ఇద్దరు వ్యక్తులను పట్టపగలే బంధించి బెదిరింపులకు పాల్పడటం ముంబైలో సంచలనంగా మారింది....
17 మంది పిల్లలు.. మరో ఇద్దర్ని కూడా
ముంబైలోని పొవైలో ఘటన
పోలీసుల భారీ రెస్క్యూ ఆపరేషన్
ఎదురుకాల్పుల్లో నిందితుడి మృతి
ముంబై, అక్టోబరు 30: ఆడిషన్స్ పేరుతో స్టూడియోకు రప్పించి 17 మంది పిల్లలు (13 నుంచి 17 ఏళ్ల వయసు), మరో ఇద్దరు వ్యక్తులను పట్టపగలే బంధించి బెదిరింపులకు పాల్పడటం ముంబైలో సంచలనంగా మారింది. వారిని కాపాడేందుకు పోలీసులు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నిందితుడు కాల్పులకు తెగబడగా.. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపి బందీలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. బుధవారం ముంబై పొవై ప్రాంతంలోని ఆర్‌ఏ యాక్టింగ్ స్కూల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. రోహిత్ ఆర్య.. పిల్లలను బంధించి సామాజిక మాధ్యమాల్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టి మరీ బెదిరింపులకు పాల్పడటం వైరల్‌గా మారింది. ‘నేను రోహిత్ ఆర్య. ఆత్మహత్య చేసుకోవడానికి బదులుగా ఒక ప్లాన్‌తో పిల్లలను ఇక్కడ బందీలుగా ఉంచాను. నేను ఉగ్రవాదిని కాదు.. డబ్బు అవసరం లేదు. నావి సాధారణ డిమాండ్లే.. నేను కొందరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ డిమాండ్ నెరవేర్చకపోతే స్టూడియోను తగలబెడతా..’ అంటూ నిందితుడు ముందు వీడియోలో హెచ్చరించాడు. దీనిపై సమాచారమందుకు న్న ముంబై పోలీసులు.. అగ్నిమాపక దళంతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. నిందితుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా అతడు నిరాకరించాడు. దీంతో బాత్రూం గది ద్వారా స్టూడియోలోనికి ప్రవేశించిన పోలీసులు.. 2గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే నిందితుడు కాల్పులకు తెగబడగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపా రు. దీంతో అతడు తీవ్రంగా గాయపడటంతో అదుపులోకి తీసుకొని.. 19 మందిని సురక్షితంగా బ యటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలంలో ఓ ఎయిర్‌గన్, పలు రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొద్దిరోజులుగా అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని.. తన పనికి సంబంధించిన బకాయి డబ్బుల కోసమే ఇదంతా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వెనక ఇంకా ఎవరైనా ఉన్నరా అన్నది గుర్తించే పనిలో పడ్డారు.