Parliament Sessions: అమిత్‌షా ప్రసంగం.. పీఎం రాలేదంటూ విపక్షాలు వాకౌట్
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:04 PM
ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్‌షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్‌షా చెప్పారు.

న్యూఢిల్లీ: విపక్ష ఎంపీల నినాదాల మధ్య కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రాజ్యసభలో రెండోరోజైన బుధవారంనాడు 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor)పై జరుగుతున్న చర్చల్లో మాట్లాడారు. అయితే ప్రధానమంత్రి పార్లమెంటుకు హాజరై కూడా రాజ్యసభకు ముఖం చాటేశారంటూ విపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు. ప్రధాని సభకు హాజరై మాట్లాడాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. నిరసనగా తిరిగి అమిత్‌షా ప్రసంగం కొనసాగించడానికి ముందు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో పలువురు విపక్ష నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు.
'ప్రధానమంత్రి సభకు వచ్చి సమాధానం ఇవ్వాలని విపక్షాలు అడుగుతున్నాయి. ఆయన పార్లమెంటు ప్రాంగణంలో ఉండి కూడా సభకు హాజరుకాకపోవడం పెద్దలసభను అవమానించినట్టే' అని కాంగ్రెస్ విపక్ష నేత, పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు.
పీఎంఓలో ఉన్నారు
ప్రధానమంత్రి సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టంతో ఆయన తమ కార్యాలయంలో (పీఎంఓ) ఉన్నారని సభకు అమిత్‌షా తెలియజేశారు. విపక్షాలు కోరినంత వరకూ చర్చ జరిపే విషయంపై నిర్ణయం తీసుకునేది బిజినెస్ అడ్వయిజరీ కమిటీ అని, కానీ ఎవరు సమాధానం ఇవ్వాలని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, ప్రధానమంత్రి మోదీ అని అమిత్‌షా చెప్పారు. ప్రధాన మంత్రిని ఏమి అడగదలుచుకున్నారో వాటికి సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అలాంటప్పుడు ఆయన నుంచి వినాలనుకోవడం ఎందుకు? అని విపక్షాలను ఆయన ప్రశ్నించారు. తిరిగి ఆయన ప్రసంగం కొనసాగించడానికి ఉద్యుక్తులు కావడంతో సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. దీనికి ముందు, మంగళవారంనాడు రాజ్యసభలో మల్లికార్జున్ ఖర్గే ప్రధానిపై విసుర్లు విసిరారు. అఖిల పక్ష సమావేశం జరుగుతుంటే ప్రధాని బీహార్ ప్రచార సభకు వెళ్లారని, పార్లమెంటులో జరుగుతున్న చర్చలో పాల్గొని అందరి అభిప్రాయాలు వినాలని, వినేందుకు ధైర్యం లేకపోతే ఆ పదవిలో ఉండేందుకు అర్హులు కారని విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
నన్ను కంట్రోల్ చేయకండి.. కస్సుమన్న జయాబచ్చన్
అప్పటివరకూ పాక్‌కు సింధూ జలాలు ఇవ్వం.. తేల్చిచెప్పిన జైశంకర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి