Kharge: నేషనల్ హెరాల్డ్ కేసుపై ప్రజల్లోకి వెళ్తాం
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:12 AM
కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జిషీట్‌లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.

అక్రమ కేసులకు భయపడం..రేపటి నుంచి పలు రూపాల్లో ఉద్యమాలు
మే 31నాటికి డీసీసీల నియామకం పూర్తి: ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ అధినాయకత్వంపై పెద్ద కుట్ర జరుగుతోందని, బీజేపీ అక్రమంగా కేసులు పెడుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీల పేర్లను అక్రమంగా ఛార్జిషీట్‌లో చేర్చడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. ఈ కేసుపై ప్రజల్లోకి వెళ్దామని, అన్ని విషయాలను వారికి వివరిద్దామని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంస్థ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఖర్గే మాట్లాడారు. ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. మోదీ, అమిత్ షాలు క్రిమినల్ బుద్ధితో కాంగ్రెస్ అగ్రనాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ చేపట్టనున్న ఉద్యమాల వివరాలను ఖర్గే ప్రకటించారు. సోనియా, రాహుల్‌లపై ఈడీ పెట్టిన కేసుల గురించి ఈ నెల 21 నుంచి 24 వరకు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి మే 30 వరకు రాజ్యాంగాన్ని కాపాడడం గురించి ప్రత్యేక కార్యాచరణను రూపొందించామని తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి 30 వరకు ర్యాలీలు నిర్వహిస్తామని, మే 3 నుంచి మే 10 వరకు జిల్లా స్థాయిల్లో, మే 11 నుంచి మే17 వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడతామని వివరించారు. మే 20 నుంచి 30 వరకు ఇంటింటికీ వెళ్లి బీజేపీ అరాచకాలను వివరిస్తామని తెలిపారు. మరోవైపు, అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో జిల్లా కమిటీలను బలోపేతం చేయాలని నిర్ణయించామని ఖర్గే గుర్తు చేశారు. మే 31నాటికి దేశంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..