Kerala Kottiyoor Festival 2025: కేరళ కొట్టియూర్ ఉత్సవ వైభవం, ప్రకృతి మాతకు నీరాజనం
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:36 PM
కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..

ఇంటర్నెట్ డెస్క్: కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో కొట్టియూర్ అనే ప్రాంతంలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు, అంటే సాధారణంగా మే, జూన్ నెలల్లో 28 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పర్వదినాల వేళ భక్తులు పవిత్రమైన ఒడపూ పుష్ప ఆచారాన్ని ఆస్వాదిస్తారు. పవిత్రమైన వెదురు పుష్పం అయిన ఒడపూ పుష్పాన్ని కరుణ, కటాక్ష్యాలకు చిహ్నంగా కేరళ ప్రజలు అనాదిగా నమ్ముతూ దేవదేవునికి సమర్పిస్తున్నారు. ప్రతి వర్షాకాలం ప్రారంభం నుంచి 28 రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు కేరళ భక్త ప్రజానీకం. పశ్చిమ కనుమలలో, ఉప్పొంగుతున్న బవేలి నది తీరాన జరిగే కొట్టియూర్ పండుగ, పురాణాలు, ప్రకృతి సహజ సౌందర్యం, ఇంకా శతాబ్దాల నాటి వేద, గిరిజన ఆచారాలను ప్రతిబింబిస్తుంది.
ఓడపూవు లేదా ఓడప్పు అని కూడా పిలిచే ఓడపూ సాధారణ పువ్వు కాదు. ఇది సజీవ పుష్పం కాకపోయినా, ఆ చెట్టు వెదురుతో తయారు చేసిన పువ్వు ఎంతో సాంస్కృతిక అర్థాన్ని కలిగి ఉంది. దీనిని ఈ పండుగ సమయంలో శివుడికి అర్పిస్తారు. అనంతరం ఈ పుష్పాన్ని భక్తులు దైవానుగ్రంతో ఇళ్లకు తీసుకువెళతారు.
కొట్టియూర్ వైశాఖ మహోత్సవం ఏటా కేరళలోని కన్నూర్ జిల్లాలోని అడవులలో ఉన్న అక్కరే కొట్టియూర్ ఆలయంలో జరుగుతుంది. ఈ ఏడాది ఈ పండుగ జూన్ 8 నుండి జూలై 4 వరకు ఉంటుంది. మలయాళ నెలలైన ఎడవం, మిధునంలో ఈ ఉత్సవం నిర్వహిస్తారు. కేరళ, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలి వస్తుంటారు. అక్కరే కొట్టియూర్ ఆలయం నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం పండుగ ముగిసిన తర్వాత ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఇక్కరే కొట్టియూర్ దేవాలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది.
ఇక, కొట్టియూర్‌ను దక్షిణ కాశి లేదా దక్షిణ వారణాసి అని పిలుస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తికి మాత్రమే కాకుండా, దాని ఆచారాలలో పొందుపరచబడిన నిఘూడమైన పౌరాణిక మూలాలను కూడా స్పురిస్తుంది. ఈ పండుగ దక్ష యాగం, శివుని భార్య సతి తనను తాను దహనం చేసుకున్న పౌరాణిక త్యాగం, హిందూ ఇతిహాసంలో విశ్వ చరిత్రను మార్చిన సంఘటనగా భక్తులు ఈ పండుగను జ్ఞప్తికి తెచ్చుకుంటారు.
ఈ పండుగలో మరో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే, ఏనుగులు అడవి గుండా శివుడు, పార్వతి విగ్రహాలను మోసుకెళ్ళే ఎజున్నల్లిప్పు ఊరేగింపు. అటుపిమ్మట ఆనయూతు అని పిలువబడే ఈ ఏనుగులకు ఉత్సవ విందు జరుగుతుంది. పశ్చిమ కనుమల పాదాల వద్ద దట్టమైన అడవిలో ఉన్న ఈ ప్రాంతం వర్షాకాలంలో మరింత సోభాయమానంగా కనిపిస్తుంది. బవేలి నది కొత్త ఉత్సాహంతో ఉప్పొంగుతుంది. అడవిలో దట్టమైన పొగమంచు, పక్షుల కిలకిలారావాలు ఆలయ ప్రాంగణాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. ఈ ఏడాది కేరళ ఆర్టీసీ పెద్ద సంఖ్యలో రవాణా సౌకర్యాల్ని ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తోంది. దీనిపై భక్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మామూలోడు కాదు.. జాకెట్‌లో మందు సీసాలు దాచి..
ఇరాన్‌పై అమెరికా దాడి.. తీవ్రంగా ఖండించిన పాక్..