Kerala: దివ్యాంగుల కేంద్రానికి హెడ్గేవార్ పేరు..రణరంగంగా మారిన కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:08 PM
పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.

తిరువనంతపురం: పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (Palakkad Municipal Corporation) కౌన్సిల్ సమావేశం మంగళవారంనాడు రణరంగంగా మారింది. దివ్యాంగుల కేంద్రం కోసం ప్రతిపాదిత స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్‌కు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) వ్యవస్థాపకుడు డాక్టర్ కేబీ హెగ్డేవార్ పేరు పెట్టాలనే తీర్మానంపై సమావేశంలో తీవ్ర గందరగోళం తలెత్తింది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్, వామపక్ష సభ్యులు వ్యతిరేకించారు. పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన అధికార బీజేపీ సభ్యులకు, యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ కౌన్సిలర్లకు మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇది ఘర్షణగా మారడంతో సభ్యులు ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ఈ గందరగోళం మధ్యే తీర్మానాన్ని బీజేపీ ఆమోదించింది. ఈ చర్య విపక్ష కౌన్సిలర్లను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
Pahalgam Attack: పహల్గాం మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం
ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారు
ఈ ఘటనను పాలక్కాడ్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్, బీజేపీ నేత కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, లెఫ్ట్ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభా కార్యక్రమాలను అడ్డుకున్నారని ఆరోపించారు. దివ్యాంగుల కోసం స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రం ప్రారంభించాలని పాలక్కాడ్ మున్సిపాలిటీ నిర్ణయించిందని, దానిని కూడా కాంగ్రెస్, లెఫ్ట్ సభ్యులు అడ్డుకున్నారని చెప్పారు. చర్చల కోసం మంగళవారంనాటి కౌన్సిల్ సమావేశానికి అన్ని పార్టీలను చైర్మన్ ఆహ్వానించారని, చర్చలో పాల్గొనడానికి బదులుగా విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించి చైర్మన్‌పై చేయి చేసుకునేందుకు, మున్సిపల్ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
రాజకీయ దురుద్దేశంతోనే..
కాగా, దివ్యాంగుల కేంద్రానికి రాజకీయ దురుద్దేశంతోనే హెడ్గేవార్ పేరు పెట్టాలనుకున్నారని, ఇది మున్సిపల్ సంస్థల్లోనూ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే ప్రయత్నమేనని విపక్ష సభ్యులు మండిపడ్డారు. ప్రజ్ఞా సంక్షేమ కేంద్రానికి హెడ్గేవార్ పేరు పెట్టడం తగదని, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని వారు డిమాండ్ చేసారు.
కాగా, పాలక్కాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు బాహాబాహీకి తలపడటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేశారు. సభ్యులెవరికీ తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. అయితే కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడికి దిగిన వీడియో బయటకు రావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి..