Jan Suraaj: బిహార్ ఎన్నికల కోసం రూ.14,000 కోట్లు మళ్లించిన కేంద్రం.. జన్‌సురాజ్ సంచలన ఆరోపణ
ABN , Publish Date - Nov 16 , 2025 | 04:13 PM
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఫారెన్ డవలప్‌మెంట్ ఫండ్స్‌ను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జన్ సురాజ్ (Jan Suraaj) ప్రతినిధి, సీనియర్ నేత పవన్ కె వర్మ (Pavan K Varma) సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన ప్రాజెక్టుకు ఉద్దేశించిన రూ.14,000 కోట్లను మళ్లించి, బిహార్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడానికి ముందు మహిళా ఓటర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు.
దారి మళ్లించిన నిధులను 'ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన' ద్వారా బిహార్‌లోని 1.25 కోట్ల మహిళల అకౌంట్లలోకి రూ.10,000 చొప్పున జమచేశారని వర్మ తెలిపారు. అయితే ఈ సమాచారాన్ని ఆయన స్వతంత్రంగా నిర్దారణ చేయలేదు. నిధులు మళ్లించినదే నిజమైతే నైతికత అనేది ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు కోసం వరల్డ్ బ్యాంకు నుంచి అందిన రూ.21,000 కోట్లలో రూ.14,000 కోట్లు దారిమళ్లినట్టు తమకు తెలుస్తోందని, ఇది వాస్తవమైతే రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ఆయన అన్నారు.
బిహార్ ఖజానా ఖాళీ
బిహార్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రానికి రూ.4.06 లక్షల కోట్ల రుణాలున్నాయని, ప్రతిరోజూ రూ.63 కోట్లు వడ్డీ కింద చెల్లింపులు జరుగుతున్నాయని పవన్ వర్మ తెలిపారు. బిహార్ ఖజానా ఖాళీ అయిన తరుణంలో ఇంత భారీ వ్యయం ఎలా సమర్ధనీయమవుతుందని ప్రశ్నించారు. ఎన్డీయే అధికారంలోకి రాకుంటే తక్కిన ఇన్‌స్టాల్‌మెంట్స్ మహిళలకు రావంటూ ఉద్దేశపూర్వకంగనే వదంతులు వ్యాప్తి చేశారని ఆయన ఆరోపించారు. 4 కోట్ల మహిళా ఓటర్లలో 1.25 కోట్ల మందికి నిధులు జమచేసి, ఎన్డీయేకు ఓటు వేయకుంటే తక్కిన వారికి చెల్లింపులు ఆపేస్తారనే అభిప్రాయం కలిగించారని అన్నారు.
పీఎం పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు
ఉచితాల సంస్కృతిని గతంలో విమర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ బిహార్‌లో ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని వర్మ ప్రశ్నించారు. ఉచితాలపై ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని మోదీ విమర్శించారని గుర్తు చేశారు. ఈ తరహా విధానాల వల్ల ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల ఎంపికపై ప్రభావం చూపించి, ఎన్నికల సక్రమ నిర్వహణపై అనుమానాలకు తావిస్తుందని అన్నారు.
జన్ సురాజ్ నష్టానికి అది కారణం కాదు..
తాము అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని రద్దు చేస్తామని జన్ సురాజ్ హామీ ఇవ్వడం వల్లే ఆ పార్టీకి భారీ నష్టం జరిగిందనే వాదనను వర్మ తోసిపుచ్చారు. మద్యపాన నిషేధ చట్టం నిజమైన అర్ధాన్ని కోల్పోయిందన్నారు. ఇందువల్ల అక్రమ మద్యం బహిరంగంగా హెచ్చుధరలకు అమ్మకాలు జరుపుతున్నారని అన్నారు. ఇందువల్ల రెండు లక్షల మందికి పైగా అట్టడుగు వర్గాలవారు బెయిలు పొందేందుకు తాహతు లేక జైలులోనే ఉన్నారని చెప్పారు. లిక్కర్ బ్యాన్ అబద్ధమని, జనం ఎక్కువ ధర చెల్లించి మద్యం తాగుతున్నారని, చట్ట ఉల్లంఘనలకు జైళ్లకు వెళ్తున్నారని, మహిళలు బాధితులవుతున్నారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
రోహిణి ఆచార్యపై దాడి చేసిన రమీజ్ నేమత్ ఎవరంటే..
బీహార్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.