Jaishankar: ట్రంప్ మాటలు సరికాదు.. అప్పుడు మోదీతో నేనూ ఉన్నాను
ABN , Publish Date - Jul 01 , 2025 | 02:57 PM
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడిని ఆర్థిక యుద్ధ చర్యగా (Economic Warfare) జైశంకర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేక అక్కడి పర్యాటకాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని చెప్పారు.

న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తాను ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసుకుంటున్న ప్రచారాన్ని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) తోసిపుచ్చారు. అందులో వాస్తవం లేదన్నారు. న్యూయార్క్‌లోని 'న్యూస్‌వీక్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జైశంకర్ మాట్లాడుతూ, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఫోనులో ప్రధాని మోదీతో మాట్లాడేటప్పుడు తాను అక్కడే ఉన్నానని, భారత్‌కు సంబంధించినంత వరకూ ట్రేడ్‌కూ, కాల్పుల విరమణకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
'మే 9వ తేదీ రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వాన్స్ ఫోను చేసినప్పుడు ప్రధానితో పాటు నేను కూడా ఉన్నాను. భారత్‌పై పాక్ పెద్దఎత్తున దాడి చేసే అవకాశం ఉందని వాన్స్ చెప్పారు. పాక్ దాడి చేస్తే దానికి దీటుగా సమాధానం ఇస్తామని వాన్స్‌తో మోదీ చెప్పారు' అని జైశంకర్ తెలిపారు. అదే రోజు రాత్రి భారత్‌పై పాక్ పెద్దఎత్తున దాడి చేసిందని, ఆ దాడులను భారత బలాలు అంతే వేగంగా, సమర్ధవంతంగా తిప్పికొట్టాయని వివరించారు.
ఆ మరుసటి రోజు ఉదయం తనకు, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని, పాకిస్థాన్ చర్చలకు రెడీగా ఉందని రూబియో చెప్పారని జైశంకర్ తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం తరువాత పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ ఖసిఫ్ అబ్దుల్లా నేరుగా డీజీఎంవో రాజీవ్ ఘాయ్‌కు ఫోన్ చేసి కాల్పులు విరమిద్దామని కోరినట్టు ఆయన వివరించారు. 'అసలు జరిగింది ఇదే' అని జైశంకర్ ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఆర్థిక యుద్ధ చర్యగా (Economic Warfare) జైశంకర్ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని చూడలేక అక్కడి పర్యాటకాన్ని దెబ్బతీయాలనే ఆలోచనతోనే ఉగ్రవాదులు పహల్గాం దాడికి పాల్పడ్డారని చెప్పారు. మతపరమైన హింసను రెచ్చగొట్టేందుకు పర్యాటకులను మతం అడిగి మరీ ఉగ్రవాదులు కాల్చి చంపారని తెలిపారు. దీంతో ఉగ్రవాదులను శిక్షించాల్సిందేనని తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉగ్రవాదులు, వారికి సహకరించే ప్రభుత్వాలకు భారత్ తగిన శిక్ష విధిస్తుందని, ఉగ్రవాద నిర్మూలనలో అణ్వస్త్ర బెదిరింపులకు లొంగేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్
బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అకృత్యం
For National News And Telugu News