Share News

Donald Trump: గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే: ట్రంప్‌

ABN , Publish Date - Jul 03 , 2025 | 06:13 AM

హమాస్‌ నాయకులు, క్యాడర్‌ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు.

Donald Trump: గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ ఓకే: ట్రంప్‌

టెహ్రాన్‌/వాషింగ్టన్‌, జూలై 2: హమాస్‌ నాయకులు, క్యాడర్‌ లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌.. 60 రోజుల పాటు కాల్పుల విరమణకు అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమ సంస్థ ‘ట్రూత్‌ సోషల్‌’లో ఓ పోస్టు చేశారు. ‘‘కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించింది. అన్ని వైపుల నుంచి సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ యుద్ధాన్ని ముగించడమే మా లక్ష్యం’’ అని పేర్కొన్నారు. అయితే.. కాల్పుల విరమణ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయాన్ని చెప్పలేదు. శాంతి చర్చలకు సహకరించిన ఖతార్‌, ఈజిప్ట్‌ వర్గాలను ఆయన అభినందించారు.


కాగా.. ఇజ్రాయెల్‌ ఈ అంశంపై స్పందించలేదని బీబీసీ న్యూస్‌ పేర్కొనగా.. యుద్ధాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామంటేనే కాల్పుల విరమణకు అంగీకరిస్తామని హమాస్‌ ప్రకటించింది. ఇదిలా ఉండగా, అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) నుంచి ఇరాన్‌ అధికారికంగా వైదొలగింది. ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్ధంలో భాగంగా.. అమెరికా తన బీ2 బాంబర్లతో ఫోర్డో, నటాంజ్‌, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే..! ఈ చర్యను నిరసిస్తూ ఐఏఈఏ నుంచి వైదొలగుతామని ప్రకటించిన ఇరాన్‌.. గత వారం పార్లమెంట్‌లో ఆ మేరకు బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ఆ బిల్లును ఆమోదించారు.

Updated Date - Jul 03 , 2025 | 06:13 AM