Narayana Murthy: మూర్తిదో మాట... ఇన్ఫోసిస్‌ది మరో బాట!
ABN , Publish Date - Jul 02 , 2025 | 06:12 AM
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సంస్థ వ్యవహరిస్తోంది.

70 గంటలు పని చేయాలన్న నారాయణమూర్తి
ఉద్యోగులు ఓవర్ టైం చేయొద్దంటున్న ఇన్ఫోసిస్
బెంగళూరు, జూలై 1: ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటలు పని చేయాలన్న ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఆయన సంస్థ వ్యవహరిస్తోంది. తమ సంస్థలో ఉద్యోగులెవరూ ఓవర్ టైం చేయొద్దని సూచిస్తోంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడంతో పాటు వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపుతోంది. వారానికి 5 రోజులు చొప్పున రోజుకు సగటున 9.15 గంటలు మాత్రమే పని చేయాలని అందులో స్పష్టం చేసింది.
ఓవర్ టైం చేయడం వల్ల ఆరోగ్య పరంగా ఎదురయ్యే ఇబ్బందులపై అందులో ఆందోళన వ్యక్తం చేసింది. పని మధ్యలో క్రమం తప్పకుండా విరామం తీసుకోవాలని, పని ఒత్తిళ్లు, ఇతరత్రా ఇబ్బందులుంటే వారి మేనేజర్‌ను సంప్రదించాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప పని గంటల అనంతరం ఉద్యోగానికి సంబంధించిన విధులు నిర్వహించొద్దని పేర్కొంది. నిర్దేశించిన సమయానికి మించి అదనంగా విధులు నిర్వర్తించే ఉద్యోగులకు హెచ్‌ఆర్ విభాగం నుంచి ఈ మెయిల్‌ను పంపిస్తున్నారు.