Share News

Oil Overload India: వంట నూనె తాగేస్తున్నాం

ABN , Publish Date - Apr 22 , 2025 | 03:37 AM

భారతదేశంలో తలసరి వంట నూనె వినియోగం ఏడాదికి 24 కేజీలకు చేరింది. ఇది ఐసీఎంఆర్‌ సూచించిన పరిమితికి రెట్టింపు కావడంతో అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి

Oil Overload India: వంట నూనె తాగేస్తున్నాం

  • దేశంలో ఏటా తలసరి వినియోగం 24 కిలోలు

  • 2001తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ

  • ఐసీఎంఆర్‌ సిఫారసు పరిమితి 12 కిలోలే

  • అధిక వాడకంతో ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు.. అనారోగ్య సమస్యలు

  • నూనె దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: దేశంలో గతంలో పోలిస్తే వంట నూనెల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం సగటున ప్రతి భారతీయుడు ఏడాదికి 24 కేజీల వంట నూనె తాగేస్తున్నాడట! దేశంలో తలసరి వంట నూనె వినియోగం గత రెండు దశాబ్దాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగిందని ‘మింట్‌’ నివేదిక వెల్లడించింది. ఇది నూనెల కోసం దిగుమతులపై ఆధారపడడాన్ని పెంచుతుందని, అదేవిధంగా ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్‌ వంటి అనారోగ్య ఆందోళనలను తీవ్రతరం చేస్తుందని పేర్కొంది. 2001లో ఏడాదికి 8.2 కేజీలుగా ఉన్న నూనె వినియోగం నేడు 23.5 కేజీలకు పెరిగిందని తెలిపింది. ఇది భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) సిఫారసు చేసిన 12 కేజీల పరిమితికి రెట్టింపు అని పేర్కొంది. దిగుమతుల అంశంపై నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేశ్‌ చంద్‌ మాట్లాడుతూ ‘నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్స్‌ ఆయిల్స్‌’ కింద ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేస్తోందని, పామాయిల్‌, సాంప్రదాయ నూనె గింజలపై దృష్టి సారించిందని తెలిపారు.


దిగుమతులపైనే ఆధారం

దేశీయంగా వంట నూనె ఉత్పత్తి ఉన్నప్పటికీ, భారత్‌ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. స్థానికంగా ఏడాదికి 1.1 కోట్ల టన్నుల నూనె మాత్రమే ఉత్పత్తి అవుతుండగా.. ఏడాదికి 2.5-2.6 కోట్ల టన్నుల వంట నూనెను భారత్‌ వినియోగిస్తోందని సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ ఆసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఈఏ) ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి సోయాబీన్‌ ఆయిల్‌, రష్యా, ఉక్రెయిన్‌ నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. 2024 నవంబర్‌, 2025 మార్చి మధ్య గత ఏడాది అదే కాలంతో పోలిస్తే భారత్‌ ముడి సోయాబీన్‌ నూనె దిగుమతి రెట్టింపు కంటే ఎక్కువై 19 లక్షల టన్నులకు పైగా చేరింది. 2023-24లో దేశ మొత్తం వంట నూనెల దిగుమతులు 1.6 కోట్ల టన్నులుగా ఉందని అంచనా.


పామాయిల్‌ వినియోగమే ఎక్కువ

పారిశ్రామిక గణాంకాల ప్రకారం.. భారత వంట నూనెల వినియోగంలో ప్రస్తుతం పామాయిల్‌ 37 శాతానికి పైగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో సోయాబీన్‌ (20%), ఆవ నూనె (14%), సన్‌ఫ్లవర్‌ (13%) ఉన్నాయి. ఇంటి బయట తిండ్లు ఎక్కువవడం, ‘రెడీ టు ఈట్‌’ ఉత్పత్తులు, బేకరీ ప్రోడక్టుల కారణంగా ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటెరింగ్‌ల నుంచి నూనె డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది.

అధిక నూనెతో అనారోగ్య సమస్యలు

పెద్ద నగరాలు, టైర్‌-2, 3 నగరాల్లో అధికంగా నూనె వినియోగించి ఇళ్లలో, బయట తయారు చేసే తిండిని తినడం వలన అనారోగ్య సమస్యలను పెంచుతున్నాయి. ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్‌, టైప్‌-2 మదుమేహం వంటి సమస్యలకు వంట నూనె అధికంగా శరీరంలోకి చేరడానికి మధ్య సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యకర జీవనం కోసం నూనె వినియోగాన్ని తగ్గించుకుందామని ప్రధాని మోదీ గత శనివారం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు.


Read Also: Karnataka DGP Murder: కర్ణాటక మాజీ డీజీపీని చంపేసిన భార్య

SpaDeX: ఇస్రో ఖాతాలో మరో ఘనత.. స్పేడెక్స్ రెండో డాకింగ్ ప్రక్రియ సక్సెస్..

China Hydrogen Bomb: చైనా సరికొత్త హైడ్రోజన్‌ బాంబు

Updated Date - Apr 22 , 2025 | 03:37 AM