Indian Railway Emergency Quota: అత్యవసర కోటా నియమాలు మార్చిన భారత రైల్వే.. ప్రయాణికులు ఏం చేయాలంటే..
ABN , Publish Date - Jul 23 , 2025 | 09:42 AM
భారత రైల్వే ప్రయాణికులకు మరో కొత్త మార్పు వచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటా నియమాలలో తాజాగా పలు సవరణలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఎమర్జెన్సీ కోటా కోసం కొన్ని రోజుల ముందే అభ్యర్థనలు స్వీకరిస్తుండగా, ఇక నుంచి ఈ ప్రక్రియ మరింత కఠినతరం కానుంది.

భారతీయ రైల్వే ప్రయాణికులకు కీలక అప్డేట్ వచ్చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ కోటాకు సంబంధించి కొత్త రూల్స్ ప్రకటించింది. ఈ క్రమంలో ఎమర్జెన్సీ కోటా (Indian Railway Emergency Quota) కోసం అభ్యర్థనలు రైలు బయలుదేరే ముందు రోజు మాత్రమే సమర్పించాలి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం ఓ సర్క్యూలర్ జారీ చేసింది. ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనలు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రైల్వే ఎమర్జెన్సీ కోటా సెల్‌కు చేరుకుని తెలపాలని వెల్లడించింది.
బయలుదేరే రోజు మాత్రం..
మధ్యాహ్నం 2:01 గంటల నుంచి రాత్రి 11:59 గంటల మధ్య బయలుదేరే రైళ్ల కోసం అభ్యర్థనలు ముందు రోజు సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలని తెలిపింది. కానీ రైలు బయలుదేరే రోజున మాత్రం ఎలాంటి అభ్యర్థనలు స్వీకరించబడవని స్పష్టం చేసింది. ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో బయలుదేరే రైళ్ల కోసం, అభ్యర్థనలు సెలవుకు ముందు చివరి పని రోజులో సమర్పించాలి.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
రైల్వే బోర్డు ఇటీవల రిజర్వేషన్ చార్ట్‌ను రైలు బయలుదేరే 8 గంటల ముందు సిద్ధం చేయాలని నిర్ణయించింది. గతంలో ఈ చార్ట్ 4 గంటల ముందు సిద్ధం చేసేవారు. ఉదయం 2 గంటలలోపు బయలుదేరే రైళ్లకు, ముందు రోజు రాత్రి 9 గంటలకు చార్ట్ సిద్ధం అవుతుంది. ఈ మార్పు కారణంగా ఎమర్జెన్సీ కోటా అభ్యర్థనల సమయాన్ని కూడా మార్చారు. ఇప్పటికే జూలై 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ రూల్స్ కూడా మారాయి. ఆధార్‌తో ధృవీకరించబడిన యూజర్లు మాత్రమే తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఎమర్జెన్సీ కోటా ఎవరి కోసం?
ఎమర్జెన్సీ కోటా అనేది వీఐపీలు, రైల్వే అధికారులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, వివిధ ప్రభుత్వ శాఖల వారికి అందుబాటులో ఉంటుంది. ఈ కోటాను జాగ్రత్తగా కేటాయించేందుకు రైల్వే బోర్డు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ మార్పుల వల్ల ఏం జరుగుతుంది?
కొత్త సమయ పరిమితులను అనుసరించడం వల్ల రిజర్వేషన్ చార్ట్ సకాలంలో సిద్ధం అవుతుంది. ఇది రైళ్ల ఆలస్యాన్ని తగ్గించి, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేస్తుంది. అభ్యర్థనలు సమర్పించే అధికారులు, అభ్యర్థి ప్రామాణికతను నిర్ధారించాలని, నియమాలను కచ్చితంగా పాటించాలని రైల్వే సూచించింది.
ప్రయాణికులు ఏం చేయాలి?
మీరు ఎమర్జెన్సీ కోటా ద్వారా టికెట్ బుక్ చేయాలనుకుంటే, రైలు బయలుదేరే ముందు రోజు సమయ పరిమితులను గుర్తుంచుకోండి. ఆదివారాలు లేదా సెలవు రోజులకు సంబంధించిన అభ్యర్థనల కోసం చివరి పని దినంలో అభ్యర్థన సమర్పించండి. ఈ నియమాలను పాటించడం వల్ల మీ ప్రయాణం సజావుగా సాగుతుంది.
ఇవి కూడా చదవండి
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి