Share News

India Defense Technology: డ్రోన్‌ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి

ABN , Publish Date - Jul 26 , 2025 | 02:43 AM

మన దేశ ఆయుధ బలం రోజురోజుకు పదునెక్కుతోంది.

India Defense Technology: డ్రోన్‌ నుంచి దూసుకెళ్లిన స్వదేశీ క్షిపణి

యూఎల్‌పీజీఎం-వీ3 పరీక్ష విజయవంతం

  • కర్నూలులోని ఎన్‌ఓఏఆర్‌లో పరీక్షించిన డీఆర్‌డీవో

  • లక్ష్యాలను కచ్చితంగా ఛేదించే 12.5 కిలోల క్షిపణి

  • రక్షణ వ్యవస్థలో ఇదో మైలురాయి: రాజ్‌నాథ్‌

  • ఏపీ భాగస్వామ్యం గర్వకారణం: చంద్రబాబు

న్యూఢిల్లీ/ఓర్వకల్లు/అల్వాల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): మన దేశ ఆయుధ బలం రోజురోజుకు పదునెక్కుతోంది. స్వదేశీ ఆయుధాల సామర్థ్యంలో తాజాగా మరో ముందడుగు పడింది. డ్రోన్ల నుంచి లక్ష్యాలపైకి దూసుకెళ్లే మరో తేలికపాటి క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. యూఏవీ లాంచ్డ్‌ ప్రెసిషన్‌ గైడెడ్‌ మిసైల్‌ (యూఎల్‌పీజీఎం)-వీ3ని డీఆర్‌డీవో కర్నూలులోని నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌ (ఎన్‌ఓఏఆర్‌)లో పరీక్షించింది. దీంతో శత్రుదుర్భేద్యమైన ప్రాంతాల్లో కూడా మానవరహిత ఏరియల్‌ వెహికిల్‌ ద్వారా ఈ క్షిపణిని సందించవచ్చు. విజయవంతమైన ఈ పరీక్ష విషయాన్ని శుక్రవారం సోషల్‌ మీడియా ఎక్స్‌ వేదికగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. భారత రక్షణ సామర్థ్యాల్లో ఇదో మైలురాయి అని ఆయన అభివర్ణించారు. స్వదేశీ రక్షణ పరిశ్రమ ఇప్పుడు సంక్లిష్టమైన రక్షణ సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయగలదని, అలాగే ఉత్పత్తి చేయగలదని ఆయన అన్నారు. గతంలో డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన యూఎల్‌పీజీఎం-వీ2 కన్నా ఇది మెరుగైన వెర్షన్‌. యూఎల్‌పీజీఎం-వీ3లో హెచ్‌డీ డ్యూయల్‌ చానల్‌ సీకర్‌ను ఏర్పాటు చేయడం వల్ల వివిధ రకాల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. మైదాన ప్రాంతాలు, ఎత్తయిన ప్రదేశాల్లోనూ ఈ క్షిపణితో దాడులు చేయవచ్చు. పగలు, రాత్రి వేళల్లో దాడి చేయగల సామర్థ్యం దీని సొంతం అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా ఈ క్షిపణిని బెంగళూరుకు చెందిన న్యూస్పేస్‌ రీసెర్చ్‌ టెక్నాలజీస్‌ అనే స్వదేశీ స్టార్టప్‌ సంస్థ రూపొందించిన డ్రోన్‌ ద్వారా పరీక్షించారు. అదానీ డిఫెన్స్‌, బీడీఎల్‌, 30 ఎంఎ్‌సఎంఈలు, స్టార్ట్‌పలు ఈ పరీక్షలో భాగస్వాములుగా ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, కర్నూలులోని నేషనల్‌ ఓపెన్‌ ఏరియా రేంజ్‌ నుంచి డ్రోన్‌ ద్వారా క్షిపణి ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా అభినందనలు తెలిపారు.


2వేల కోట్లతో ఫైర్‌ కంట్రోల్‌ రేడార్లు

వైమానిక రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అధునాతన ఎయిర్‌ డిఫెన్స్‌ ఫైర్‌ కంట్రోల్‌ రేడార్ల కొనుగోలుకు సంబంధించి భారత్‌ ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌)తో రూ.2 వేల కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు సహా అన్ని రకాల వైమానిక ముప్పులను ఈ అధునాతన రేడార్లు గుర్తించగలవని తెలిపింది.

యూఎల్‌పీజీఎం-వీ3 విశేషాలివీ..

  • డ్రోన్ల(యూఏవీ) నుంచి ప్రయోగించే క్షిపణి ఇది.

  • రక్షణ సిబ్బందికి ప్రమాదాలు తగ్గించడానికి, పూర్తి కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించడానికి అభివృద్ధి చేశారు.

  • అధునాతన యుద్ధాలకు తగ్గట్లుగా సాంకేతిక పరిజ్ఞానం అమర్చారు. కదులుతున్న లక్ష్యాలనూ ఛేదిస్తుంది.

  • కవచం ఉన్న అధునాతన సాయుధ వాహనాలను ఇది ధ్వంసం చేయగలదు. బంకర్లలోకి చొచ్చుకెళ్లి పేలే వార్‌హెడ్‌ దీనిలో ఉంది.,

  • చీకట్లోనూ లక్ష్యాలను కచ్చితంగా గుర్తించడానికి ఇమేజింగ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ సీకర్స్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు.

  • ఆకాశం నుంచి భూమి మీద గల లక్ష్యాలను ఛేదిస్తుంది. పగటిపూట 4 కిలో మీటర్లు, రాత్రి 2.5 కిలోమీటర్ల రేంజ్‌ను చేరుకుంటుంది.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 02:43 AM