Share News

India Strong Reply to Pak: చుక్క నీరు పోనివ్వం

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:47 AM

భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ పాక్‌కు నీటి పంపకాన్ని నిలిపివేయనున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్‌కు భారత్‌ కఠినంగా స్పందించింది

India Strong Reply to Pak: చుక్క నీరు పోనివ్వం

  • ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచీ మాది

  • ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నాం

  • హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ వెల్లడి

  • జమ్ముకశ్మీర్‌లో నివసించే స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, కశ్మీరీ పండిట్లే లక్ష్యంగా దాడులకు.. ‘ఉగ్ర’ ప్రణాళికలు?

  • భద్రతా దళాలు అప్రమత్తం.. సిబ్బంది సెలవులు రద్దు

  • వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు

  • శ్రీనగర్‌కు ఆర్మీ చీఫ్‌.. అక్కడ భద్రత పరిస్థితిపై సమీక్ష

  • సరిహద్దుల్లో రాఫెల్స్‌ గర్జన.. ఐఏఎఫ్‌ యుద్ధ విన్యాసాలు

  • బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. లష్కరేకమాండర్‌ హతం

  • పహల్గాం ఉగ్రవాదుల ఇళ్లలో పేలుళ్లు

  • భద్రతా దళాలే లక్ష్యంగా పేలుడు పదార్థాల నిల్వ?

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 25: సింధు జలాలను మళ్లించే యత్నాలను యుద్ధచర్యగా భావిస్తామంటూ పాక్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ తీవ్రస్థాయిలో స్పందించింది! ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దాయాది దేశానికి మన గడ్డ మీద నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచీ తమదని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ తేల్చిచెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టు భారత్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న నదులపై నిర్మించిన ఆనకట్టల స్టోరేజీ సామర్థ్యాన్ని, ఆపరేషనల్‌ సామర్థ్యాన్ని పెంచాలని అందులో నిర్ణయించారు.


ఈ భేటీ అనంతరం పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడిన సీఆర్‌ పాటిల్‌.. ప్రధాని నరేంద్రమోదీ తమకు ఈ దిశగా పలు సూచనలు చేశారని, వాటిపై సమావేశంలో చర్చించామని, వాటిని సమర్థంగా అమలుచేసేందుకు అమిత్‌ షా పలు సూచనలు చేశారని తెలిపారు. ‘‘నీటి నిలిపివేతకు సంబంధించి వ్యూహాన్ని ఈ భేటీలో సిద్ధం చేశాం. అందులో భాగంగా మూడు ప్రత్యామ్నాయాలపై చర్చించాం. సింధు జలాల నుంచి ఒక్క చుక్క నీరు కూడా పోకుండా తీసుకోవాల్సిన స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఆయా నదుల్లో పూడికతీత పనులు పూర్తిచేసి, నీటిని మళ్లిస్తాం’’ అని ఆయన వివరించారు. అనంతరం.. ‘‘సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం న్యాయబద్ధమైనది. అది దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం. సింధు జలాల్లో ఒక్క చుక్క నీరు కూడా పాకిస్థాన్‌కు వెళ్లకుండా మేం చూస్తాం’’ అని ఆయన ‘ఎక్స్‌’లో కూడా పోస్ట్‌ చేశారు. పర్యాటకులపై దాడి నేపథ్యంలో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా.. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్న బలమైన సందేశాన్ని భారతదేశం పాక్‌కు పంపిందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు.. తాజా పరిణామాల నేపథ్యంలో సింధు జలాల వినియోగం నిమిత్తం చేపట్టిన వివాదాస్పద కాల్వల ప్రాజెక్టును పాక్‌ ఉపసంహరించుకుంది.


dsdws.jpg

మరిన్ని దాడులు?

కశ్మీర్‌లోని స్థానికేతరులు, రైల్వే ఆస్తులు, పండిట్లే లక్ష్యంగా దాడులకు ఉగ్రవాదులు క్రియాశీలంగా ప్రణాళికలు రచిస్తున్నారంటూ నిఘా వర్గాలు అందించిన సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. కశ్మీర్‌ లోయలో పనిచేస్తున్న రైల్వే సిబ్బందిలో చాలామంది స్థానికేతరులే. చాలా మంది రైల్వే భద్రతా సిబ్బంది తరచుగా తమ బ్యారక్‌ల నుంచి బయటకు వచ్చి స్థానిక మార్కెట్లకు వెళ్తుంటారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో.. బ్యారక్‌ల నుంచి బయటకు వెళ్లినవారిపై దాడులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలా వెళ్లొద్దంటూ అధికారులు వారిని ఆదేశించారు. ఉగ్రవాదులే కాక.. పాక్‌ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ కూడా శ్రీనగర్‌, గాందర్‌బల్‌ జిల్లాల్లో కశ్మీరీ పండిట్లు, పోలీసులే లక్ష్యంగా దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్టు హెచ్చరికలు జారీ అయ్యాయి. మరోవైపు.. పహల్గాం దాడి నేపథ్యంలో భారత సైన్యం ఉగ్రవాదులపై వేటను ముమ్మరం చేసింది. పారామిలటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది. సెలవుపై ఉన్న జవాన్లు వెంటనే తిరిగి వచ్చి విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌ అంతటా భద్రత బలగాలను మోహరించారు. శ్రీనగర్‌ విమానాశ్రయంలో భద్రతను పెంచారు. అన్ని వైమానిక స్థావరాల్లో యుద్ధ విమానాలను సిద్ధం చేస్తున్నారు. సైనికులను సరిహద్దులకు తరలిస్తున్నారు. కాగా.. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకుని భద్రత పరిస్థితిని సమీక్షించారు.


పాక్‌ దుస్సాహసం..ఎల్‌వోసీ వద్ద కాల్పులు

పహల్‌గామ్‌లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్‌పై పాకిస్థాన్‌ కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణను ఉల్లంఘించి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీఎత్తున కాల్పులు ప్రారంభించింది. భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది శ్రీనగర్‌, ఉధంపూర్‌లో పర్యటించడానికి కొన్ని గంటల ముందు ఈ దుశ్చర్యకు దిగింది. అయితే భారత జవాన్లు దీటుగా తిప్పికొట్టారు. కాగా.. ఎల్‌వోసీ వెంబడి పాక్‌ తన సేనలను రెట్టింపు చేసింది. భారత్‌ ఏ క్షణమైనా సైనిక దాడి చేయవచ్చన్న అంచనాతో పెద్దఎత్తున బలగాలను తరలిస్తోంది. అయితే సైనికులంతా బంకర్లలోనే ఉండి.. పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించింది. పాక్‌ ఆపరేషనల్‌ కంట్రోల్‌-కమాండ్‌ చూసే పదాతిదళం పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆర్మీ చీఫ్‌ అసీమ్‌ మునీర్‌ ఆదేశించారు.

అది ముమ్మాటికీ ఉగ్రదాడే!

జమ్ముకశ్మీర్‌లోని పహల్‌ గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిని అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’.. ‘తీవ్రవాద దాడి’గా పేర్కొనడాన్ని అగ్రరాజ్యానికి చెందిన విదేశీ వ్యవహారాల హౌస్‌ కమిటీ తీవ్రంగా ఖండించింది. ‘‘అది ముమ్మాటికీ ఉగ్రదాడే. మీరు తీవ్రవాద దాడి అని ఎలా తీర్మానిస్తారు?’’ అని మీడియా సంస్థను నిలదీసింది. అంతేకాదు.. సదరు పత్రిక ఈ కథనానికి పెట్టిన శీర్షికను సవరించి ‘తీవ్రవాదులు’ అనే పదాన్ని ‘ఉగ్రవాదులు’గా మార్చి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కమిటీ సభ్యులు షేర్‌ చేశారు.


Bihar: మా నాన్నే మళ్లీ సీఎం, నో డౌట్

Rekha Gupta: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్

Tahawwur Rana: ప్రతీ రోజు 8 నుంచి 10 గంటల పాటు విచారణ..

BJP: హిమాలయాలకు అన్నామలై.. బాబా గుహలో ధ్యానం

Updated Date - Apr 26 , 2025 | 04:47 AM