Pakistan Visa Cancellation: 48 గంటల్లో వెళ్లిపోవాల్సిందే
ABN , Publish Date - Apr 25 , 2025 | 04:03 AM
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్థానీల వీసాలను రద్దు చేసి, 48 గంటల్లో దేశం వీడాలని, మెడికల్ వీసాదారులు ఏప్రిల్ 29లోగా వెళ్లాలని ఆదేశించగా, అట్టారీ-వాఘా చెక్‌పోస్టు ద్వారా పాక్ జాతీయులు తిరిగి వెళ్తున్నారు

పాకిస్థాన్ జాతీయులకు.. అన్ని రకాల వీసాలు రద్దు
వైద్యం కోసం మెడికల్ వీసాలపై వచ్చినవారికి మాత్రం 29వ తేదీ వరకు గడువు
ఆదేశాలు జారీ చేసిన విదేశాంగ శాఖ
అట్టారీ-వాఘా చెక్‌పోస్టు మీదుగా..తిరిగి వెళ్లిపోతున్న పాకిస్థానీయులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కఠిన చర్యలు చేపట్టిన భారత్.. పాకిస్థాన్ జాతీయులకు అన్నిరకాల వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు 48 గంటల్లోగా తిరిగి వెళ్లిపోవాలంటూ విదేశాంగశాఖ గురువారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేసింది. సాధారణ వీసాలపై భారత్‌కు వచ్చిన పాకిస్థానీయులు ఈ నెల 27వ తేదీ నాటికల్లా తిరిగి వెళ్లిపోవాలని.. వైద్యం కోసం మెడికల్ వీసాలపై వచ్చినవారు 29వ తేదీలోగా వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇకపై పాకిస్థానీలకు ఎలాంటి వీసాలు ఇవ్వకుండా వీసా సర్వీసులను సస్పెండ్ చేసింది. మరోవైపు భారతీయులెవరూ పాకిస్థాన్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే పాకిస్థాన్‌లో ఉన్నవారు వెంటనే తిరిగి రావాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో పాకిస్థానీయులు సరిహద్దుల్లోని అట్టారీ-వాఘా సమీకృత చెక్‌పోస్టు మీదుగా తమ దేశానికి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని బంధువులను కలిసేందుకు పాకిస్థాన్‌లోని కరాచీ నుంచి వచ్చిన ఓ కుటుంబం.. చెక్‌పోస్టు వద్ద మీడియాతో మాట్లాడింది. ‘‘బంధువులను కలిసేందుకు ఏప్రిల్ 15న ఢిల్లీకి వచ్చాం. 45 రోజులు వీసా గడువు ఉంది. కానీ వెంటనే తిరిగి వెళ్లిపోవాల్సి వస్తోంది. పహల్గాంలో దాడి చేసినది ఎవరైనా సరే అది తప్పే. ఇలాంటి విద్వేషాన్ని మేం కోరుకోవడం లేదు’’ అని పేర్కొంది. మరోవైపు ఇప్పటికే పాకిస్థాన్‌లోని బంధువుల వద్దకు వెళ్లిన భారతీయులు ఇదే చెక్‌పోస్టు మీదుగా తిరిగి వచ్చేస్తున్నారు.
‘ఎక్స్’ ఖాతా, పీఎస్ఎల్ నిలిపివేత
పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన అధికారిక ‘ఎక్స్’ ఖాతాను భారతదేశంలో నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ‘ఎక్స్’ సంస్థ ఈ చర్య చేపట్టింది. మరోవైపు మన ఐపీఎల్ తరహాలో పాకిస్థాన్ నిర్వహించే ‘పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)’ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారాన్ని భారత్‌లో నిలిపివేశారు. ఫ్యాన్‌కోడ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పీఎస్ఎల్‌కు సంబంధించిన అన్ని రకాల సమాచారాన్ని కూడా తొలగించేసింది.
నేను పాకిస్థానీ కాదు..: ప్రభాస్ హీరోయిన్
ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన నటులు, గాయకులు, టెక్నీషియన్లు భారత సినీ పరిశ్రమలో పనిచేయకుండా నిషేధిస్తున్నట్టు ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ సంస్థ ప్రకటించింది. ఇక ప్రభాస్ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న ఇమాన్వీ ఇస్మాయిల్ పాకిస్థానీ అని, ఆమెను తప్పించాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇమాన్వీ స్పష్టత ఇచ్చారు. తాను భారతీయ అమెరికన్ అని, లాస్ ఏంజిలిస్‌లో పుట్టానని తెలిపారు. తనకు, తన కుటుంబంలో ఎవరికీ కూడా పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు లేవని, తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
పాక్ దౌత్యవేత్తకు సమన్లు.. మిలటరీ దౌత్య సిబ్బందికి నోటీసులు
పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాకిస్థాన్‌పై భారత్ కఠిన ఆంక్షల పరంపర కొనసాగుతూనే ఉంది. దౌత్యపరమైన సంబంధాల విషయంలో తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఉన్నత దౌత్యాధికారి సాద్ అహ్మద్ వరైచ్‌కు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమన్లు పంపింది. ఆయనను స్వయంగా పిలిపించి పాక్ మిలిటరీ దౌత్య సిబ్బందికి నోటీసులు (పర్సోనా నాన్ గ్రాటా) అందించింది. ఈ నోటీసు అందుకున్నవారంతా వారం రోజుల్లోగా భారత్‌ను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి ఉంటుంది. దౌత్యపర ఆంక్షలు మే ఒకటో తేదీ వరకు అమలులో ఉంటాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. రాయబార కార్యాలయాల్లోని సిబ్బంది సంఖ్యను క్రమంగా 55 నుంచి 30కు తగ్గిస్తామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రక్షణ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.