Share News

France: బంధం బలోపేతం

ABN , Publish Date - Feb 13 , 2025 | 05:21 AM

ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పిలుపునిచ్చారు.

France: బంధం బలోపేతం

  • వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు పెంచుకోవాలి

  • అంతర్జాతీయ వేదికపై మన భాగస్వామ్యం పెరగాలి

  • ద్వైపాక్షిక చర్చల్లో మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌

  • అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘ చర్చలు

  • ఫ్రాన్స్‌లో కొత్త కాన్సులేట్‌ను ప్రారంభించిన మోదీ

పారిస్‌, ఫిబ్రవరి 12: ఇరు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను పెంపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ పిలుపునిచ్చారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సంబంధాలను, వివిధ అంతర్జాతీయ వేదికల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ.. మంగళవారం సాయంత్రం ఫ్రాన్స్‌ అధ్యక్ష విమానంలో పారిస్‌ నుంచి మార్సెల్లీకి వెళ్లారు. అక్కడ మేక్రాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు, కీలక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విస్తృత చర్చల అనంతరం వారిద్దరూ మాట్లాడుతూ.. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రపంచ కృత్రిమ మేధ.. సామాజిక, ఆర్థిక, పర్యావరణానికి ఉపయోగపడే ఫలితాలను అందించగలిగేలా నిర్దిష్ట చర్యలు తీసుకునేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పస్టం చేశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు కీలకమైన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపైనా తాము చర్చించినట్టు సంయుక్తంగా ప్రకటించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు నొక్కిచెప్పారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మేక్రాన్‌ మరోసారి స్పష్టం చేశారు.


భారత్‌కు రావాలని మేక్రాన్‌కు ఆహ్వానం

రక్షణ, సివిల్‌ న్యూక్లియర్‌ ఎనర్జీ, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాల్లో సహకారంపై మోదీ, మేక్రాన్‌ సమీక్షించారు. క్షిపణులు, హెలికాప్టర్‌ ఇంజన్లు, జెట్‌ ఇంజన్లపై జరుగుతున్న చర్చలను ఇరువురూ స్వాగతించారు. భారత్‌ రూపొందించిన పినాకా రాకెట్‌ లాంచర్‌ వ్యవస్థను పరిశీలించాలని ఫ్రాన్స్‌ను మోదీ కోరారు. ఈ వ్యవస్థను కొనుగోలు చేస్తే ఇండో-ఫ్రాన్స్‌ రక్షణ సంబంధాల్లో మరో మైలురాయి అవుతుందన్నారు. 2024లో పారిస్‌ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు మేక్రాన్‌ను మోదీ అభినందించారు. 2036లో ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ అనుభవాన్ని, నైపుణ్యాన్ని పంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేసిన మేక్రాన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మార్సెల్లీ సమీపంలోని తీరప్రాంత పట్టణం కాసిన్‌లో ప్రధాని మోదీకి.. మేక్రాన్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా భారత్‌లో పర్యటించాల్సిందిగా.. మేక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు. మేక్రాన్‌తో కలిసి మార్సెల్లీ నగరంలో భారత నూతన దౌత్య కార్యాలయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటు ద్వారా ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని చెప్పారు. అనంతరం మజార్గెస్‌ మిలటరీ శ్మశాన వాటికను వారు సందర్శించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల సమాధుల వద్ద మోదీ, మేక్రాన్‌ పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళి అర్పించారు. ఫ్రాన్స్‌లోనే ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కుమారుడు వివేక్‌ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఆ చిన్నారికి బర్త్‌డే గిఫ్ట్‌ కూడా ఇచ్చారు. గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌తో కూడా మోదీ భేటీ అయ్యారు. కృత్రిమ మేధ భారత్‌లో తీసుకురానున్న అద్భుతమైన అవకాశాలపై చర్చించారు. ‘డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ కోసం గూగుల్‌, భారత్‌ కలిసి ఎలా పనిచేయవచ్చో మాట్లాడారు. పారి్‌సలో మంగళవారం జరిగిన ఏఐ సదస్సు సందర్భంగా మోదీని కలిసినట్టు సుందర్‌ పిచాయ్‌ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.


12 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితా సిద్ధం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలవనున్నారు. ఈ క్రమంలో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో నక్కి భారత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 మంది గ్యాంగ్‌స్టర్ల జాబితాను సిద్ధం చేసి దాన్ని అమెరికాకు ఇవ్వనుంది. ఆ గ్యాంగ్‌స్టర్లను అప్పగించాలని కోరనున్నట్టు తెలిసింది. ఈ జాబితాలో.. దర్మన్‌జోత్‌ సింగ్‌, అమృత్‌పాల్‌ సింగ్‌, హర్‌జోత్‌ సింగ్‌, హర్బీర్‌ సింగ్‌, నవరూప్‌ సింగ్‌, స్వరణ్‌ సింగ్‌, సాహిల్‌ కైలాష్‌ రిటోలి, యోగేశ్‌, భాను ప్రతాప్‌ సంబ్లీ, అమన్‌ సాంబి పేర్లు ఉన్నాయి.

Updated Date - Feb 13 , 2025 | 05:21 AM