Share News

35,170 మంది పాన్‌కార్డుదారులకు ఐటీ లేఖ

ABN , Publish Date - Jan 14 , 2025 | 05:24 AM

పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ నిరంతర డ్రైవ్‌ చేపట్టింది. భారీ నగదు లావాదేవీలు జరిపిన 35,170 మంది పాన్‌కార్డుదారులను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారికి తాజాగా సోమవారం లేఖలు పంపింది.

35,170 మంది పాన్‌కార్డుదారులకు ఐటీ లేఖ

ముంబై/న్యూఢిలీ, జనవరి 13: పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా ఆదాయపుపన్ను శాఖ నిరంతర డ్రైవ్‌ చేపట్టింది. భారీ నగదు లావాదేవీలు జరిపిన 35,170 మంది పాన్‌కార్డుదారులను సాంకేతికత ఆధారంగా గుర్తించి, వారికి తాజాగా సోమవారం లేఖలు పంపింది. వారి ఆర్థిక లావాదేవీల వివరాలను ఆ లేఖల్లో ప్రస్తావించింది. ఐటీ రిటర్న్‌ దాఖలు చేశారా? లేదా? అనే సమాచారం కోసం కస్టమైజ్డ్‌ రెస్పాన్స్‌ షీట్‌ను కూడా లేఖకు జత చేసింది. వారి ప్రతిస్పందనను తీసుకోవడంతోపాటు, తదనంతర చర్యలు చేపట్టేందుకు ఒక నోడల్‌ సెల్‌ను ఏర్పాటు చేశామని, ఆయా వ్యక్తుల పన్ను చెల్లింపులు, రిటర్న్‌ ఫైలింగ్‌లను గుర్తించేందుకు ఆన్‌లైన్‌ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆర్థిక మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది.


దీంతోపాటు నిర్దిష్ట సమాచారం ఉన్న ఆదాయ పన్ను రిటర్న్‌ దాఖలు చేయని పాన్‌కార్డుదారులను గుర్తించేందుకు బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ ప్రాజెక్టును చేపట్టినట్టు తెలిపింది. కాగా, 2012-13 సంవత్సరంలో 14.62 లక్షల మంది మాత్రమే రూ.10 లక్షలకుపైగా ఆదాయం ఉన్నట్టు ప్రకటించగా, ఆ ఏడాది 33.83 లక్షల మంది తమ బ్యాంకు ఖాతాల్లో రూ.10 లక్షలకుపైగా డిపాజిట్లు చేసినట్టు కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ ద్వారా పరిశీలించిన రికార్డుల్లో వెల్లడైంది.

Updated Date - Jan 14 , 2025 | 05:24 AM