Share News

Jaguar Fighter Jet: కూలిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:11 AM

భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌) కి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Jaguar Fighter Jet: కూలిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌

  • ఇద్దరు వాయుసేన పైలట్ల మృతి

  • రాజస్థాన్‌లోని చురు జిల్లాలో దుర్ఘటన

  • గత 5 నెలల్లో కూలిన మూడో జాగ్వార్‌

జైపూర్‌/న్యూఢిల్లీ, జూలై 9: భారత వైమానిక దళాని(ఐఏఎఫ్‌) కి చెందిన జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు దుర్మరణం పాలయ్యారు. బుధవారం రాజస్థాన్‌లోని చురు జిల్లా భానుడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్నం 1.25 గంటల సమయంలో భారీ శబ్దంతో వ్యవసాయ క్షేత్రంలో విమానం కుప్పకూలిందని రాజల్‌దేసర్‌ పోలీసు అధికారి కమలేశ్‌ తెలిపారు. ‘సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా సూరత్‌గఢ్‌ నుంచి బయలుదేరిన ఫైటర్‌ జెట్‌ విమానం ప్రమాదవశాత్తు కుప్పకూలింది. ఘటనపై విచారణకు ఆదేశించాం. ఇద్దరు పైలట్ల దుర్మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం’ అని ఐఏఎఫ్‌ ప్రకటించింది. ఈ ఘటనపై రాజస్థాన్‌ గవర్నర్‌ హరిబావు బగాడే, సీఎం భజన్‌లాల్‌ శర్మ విచారం వ్యక్తం చేశారు.


5 నెలల్లో కూలిన మూడో విమానం..

ఈ ఏడాది మార్చి తర్వాత కూలిన మూడో జాగ్వార్‌ ఫైటర్‌ జెట్‌ విమానమిది.. మార్చి 7న హరియాణాలోని అంబాలాలో ఓ జాగ్వార్‌ జెట్‌ కూలిన ఘటనలో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఏప్రిల్‌ 3న గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మరో జెట్‌ కూలింది. సాంకేతిక లోపం కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ పైలట్‌ మరణించగా.. మరో పైలట్‌ ప్రాణాలు కోల్పోయాడు. 1979లో భారత వైమానిక దళంలో చేరిన ఈ యుద్ధ విమానాలు పాతవై పోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్న వాదనలున్నాయి. గతంలో ఈ విమానాలను వినియోగించిన బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఈక్వెడార్‌, నైజీరియా, ఒమన్‌ వంటి దేశాలు చాలా కాలం క్రితమే వాటిని ఉపసంహరించుకున్నాయి. కొన్ని విమానాలను మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచాయి. 2027-28 నుంచి ఈ ఫైటర్‌ జెట్‌ విమానాలను దశల వారీగా ఐఏఎఫ్‌ తొలగించాలనుకుంటోంది. అయితే తేజాస్‌ ఎంకే 2, రాఫెల్‌ వంటి అధునాతన ఫైటర్‌ జెట్ల కొనుగోలులో జాప్యంతో జాగ్వార్‌ జెట్‌ విమానాలను మరికొంత కాలం కొనసాగించక తప్పేలా లేదు.


ఇండిగో విమానాన్ని ఢీకొట్టిన పక్షి

బిహార్‌ రాజధాని పట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన ఇండిగో విమానాన్ని టేకాఫ్‌ అయిన కాసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దాంతో విమానాన్ని పట్నా విమానాశ్రయంలో దింపేయాల్సి వచ్చింది. 175 మంది ప్రయాణికులతో బుధవారం ఉదయం 8.42 గంటలకు బయలుదేరిన ఇండిగో విమానం (6ఈ 5009).. సుమారు 22 నిమిషాల్లోనే తిరిగొచ్చి పట్నాలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. పక్షి ఢీకొట్టడంతో ఒక ఇంజన్‌లో ప్రకంపనలు వస్తున్నట్లు గమనించిన పైలట్‌... అప్రోచ్‌ కంట్రోల్‌ యూనిట్‌ను అప్రమత్తం చేసి, పట్నాలో ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతి కోరారని విమానాశ్రయ అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 06:19 AM