Share News

IT Sector: వేతనాల్లో హైదరాబాద్‌ టాప్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 02:49 AM

అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు.. భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి.

 IT Sector: వేతనాల్లో హైదరాబాద్‌ టాప్‌

అనుభవం ఉన్న సాంకేతిక నిపుణులకు రాష్ట్ర రాజధానిలో అత్యధిక వేతనాలు

  • కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి చెన్నైలో..

  • ఐటీ, తయారీ, టెలికాంలలో ఆకర్షణీయ జీతాలు

  • ‘ఇండీడ్‌ పే మ్యాప్‌ సర్వే’లో వెల్లడి

  • నెలకు సగటున రూ.47,200 నుంచి రూ.69,700

  • ఢిల్లీ, ముంబైలలో జీవనవ్యయం భారం

న్యూఢిల్లీ, జూలై 3: అభివృద్ధి, నూతన టెక్నాలజీ, కొత్త ఉద్యోగాలు.. భారతదేశం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. పలు నగరాలు దేశ రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలను దాటి కొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. వేతనాల పెరుగుదల, ఉ ద్యోగావకాశాలకు సంబంధించి హైదరాబాద్‌, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాలు అగ్రస్థానంలో ఉన్నాయని.. ఢిల్లీ, ముంబైలను అధిగమించి ముందుకు వెళ్లాయని ‘ఇండీడ్‌’ అనే సంస్థ పే మ్యాప్‌ సర్వే పేరుతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 1300మంది కంపెనీల యజమానులు, 2500 మంది ఉద్యోగుల అభిప్రాయాలు సేకరించారు. వేతనాలు, వివిధ పరిశ్రమ రంగాలు, జీవనవ్యయం తదితర అంశాలపై వారిని ప్రశ్నించారు.


అనుభవానికి పెద్ద పీట

సర్వే ప్రకారం.. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారికి చెన్నైలో అత్యధిక వేతనం లభిస్తోంది. ఆ నగరంలో ఫ్రెషర్లకు నెలకు సగటున రూ.30,100 జీతం ఇస్తున్నారు. ద్వితీయస్థానంలో ఉన్న హైదరాబాద్‌లో ఇది రూ.28,500గా ఉంటోంది. ఒక మోస్తరు అనుభవం ఉన్న వారికి ఇచ్చే వేతనానికి సంబంధించి మాత్రం హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2-5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి హైదరాబాద్‌లో నెలకు సగటున రూ.47,200, 5 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్న వారికి రూ.69,700 జీతం లభిస్తోంది. హైదరాబాద్‌ తర్వాత స్థానాల్లో చెన్నై, అహ్మదాబాద్‌ ఉన్నాయి. టెక్నాలజీ, డిజిటల్‌ రంగాల్లో కెరీర్‌ ప్రగతి కోరుకుంటున్న వాళ్లు ప్రస్తుతం ఈ నగరాలకే అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని సర్వే వెల్లడించింది.


జీవన వ్యయం భారం

పెరుగుతున్న జీవన వ్యయానికి జీతం సరిపోతుందా అని సర్వేలో ప్రశ్నించగా.. 69 శాతం మంది లేదనే చెప్పటం గమనార్హం. వేతనం పెరుగుతున్నా కూడా రోజురోజుకీ అధికమవుతోన్న ఖర్చులకు అది సరిపోవటం లేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చెప్పిన వారు ఢిల్లీలో 96ు మంది ఉండగా, ముంబైలో 95ు, పుణెలో 94%, బెంగళూరులో 93% మంది ఉన్నారు. పెద్ద నగరాల్లో జీవనవ్యయం భరించలేని స్థాయికి చేరుకోవటం వల్లనే గ్రామాలు, పట్టణాల నుంచి ఎక్కువ మంది నగరాలకు రావటం లేదని పలువురు అభిప్రాయపడ్డారు.

ఐటీ, తయారీ.. ఆకర్షణీయ రంగాలు

ఐటీ, తయారీ, టెలికాం రంగాల్లో అధిక వేతనాలు లభిస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. కొత్తగా చేరుతున్న వారికి ఈ రంగాల్లో నెలకు సగటున రూ.28,100 నుంచి రూ.28,300 వరకూ జీతం లభిస్తోంది. అనుభవం ఉన్న వారికి రూ.68,200 వరకూ సగటు వేతనం ఉంటోంది. ప్రొడక్ట్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో గరిష్ఠ వేతనాలు (సగటున నెలకు రూ.85,500) దొరుకుతున్నాయి. వెబ్‌సైట్‌లు, యాప్‌లకు రూపకల్పన చేసే ఉద్యోగాల్లో ఉన్న నిపుణులకు (యూఐ, యూఎక్స్‌ డిజైనర్లకు) సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లతో సమానంగా వేతనాలు లభిస్తున్నాయి. సీనియర్‌ స్థాయిల్లో సగటున నెలకు రూ.65,000 వేతనం ఉంటోంది. పెద్ద నగరాలు, పేరు మోసిన నగరాలకే ఉద్యోగాలు పరిమితం కావటం లేదని, దేశంలోని ఇతర నగరాలు కూడా ఉద్యోగ, ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయని, ఈ నగరాల్లో జీవన వ్యయం కూడా తక్కువగా ఉంటోందని సర్వే వెల్లడించింది.

Updated Date - Jul 04 , 2025 | 06:13 AM