Violence On Hindus: హిందూ వ్యాపారిని కొట్టి చంపి శవంపై చిందులు
ABN , Publish Date - Jul 14 , 2025 | 04:27 AM
బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారిని షాపు నుంచి లాక్కెళ్లిన ఓ పార్టీకి చెందిన యూత్ వింగ్ కార్యకర్తలు..

బంగ్లాదేశ్‌లో దారుణం
ఢాకా, జూలై 13: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారిని షాపు నుంచి లాక్కెళ్లిన ఓ పార్టీకి చెందిన యూత్ వింగ్ కార్యకర్తలు.. దారుణంగా దాడి చేసి చంపి అతడి మృతదేహంపై డ్యాన్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా మైనారిటీలు ఆందోళనలు చేపట్టారు. అక్కడి తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్సిటీల్లో విద్యార్థులు నిరసనలతో హోరెత్తించారు. పాత ఢాకా ప్రాంతంలోని మిట్‌ఫోర్డ్ ఆస్పత్రి సమీపంలో హిందువైన లాల్‌చంద్ సోహగ్ తుక్కు వ్యాపారం చేసేవారు. ఈ నెల 9వ తేదీన అటుగా ర్యాలీగా వచ్చిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) యూత్ ఫ్రంట్‌కు చెందిన కార్యకర్తలు.. షాపు నుంచి అతడిని బయటకు ఈడ్చుకెళ్లి కాంక్రీట్ దిమ్మెలు, ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. అనంతరం అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నాక మృతదేహంపై ఉన్మాదుల్లా చిందులు వేశారు. దీనిపై లాల్‌చంద్ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 19 మంది నిందితుల పేర్లు నమోదు కాగా.. 20 మంది వరకు గుర్తు తెలియని అనుమానితులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.