Himachal Rains: హిమాచల్ ప్రదేశ్‌లో బీభత్సకర దృశ్యాలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:31 PM
హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. కొండచరియలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Himachal Rains: హిమాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోంది. మండి ప్రాంతంలో బీభత్సకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాలతో సిమ్లా-సున్నీ-కర్సోగ్ హైవే నదిలా మారిపోయింది. నిన్న (సోమవారం) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతటా ఆకాశం మేఘావృతమై, కుండపోత వర్షాలు కురిశాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. డజన్ల కొద్దీ వాహనాలు నీటిలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, చాలా ప్రాంతాల్లో రోడ్ల మీద కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండి జిల్లాలోని కర్సోగ్ డివిజన్‌లో రాత్రిపూట సంభవించిన భారీ వర్షాల కారణంగా పలువురు అదృశ్యమయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఆకస్మిక వరదలతో అనేక ఇళ్లు నీటిలో కొట్టుకుపోయాయి.
వరదల్లో చిక్కుకున్న దాదాపు 41మందిని జిల్లా యంత్రాంగం, SDRF బృందాలు రక్షించాయి. కుక్లాలో వరదల కారణంగా 10 ఇళ్లు, ఒక వంతెన కొట్టుకుపోయాయి. మండి జిల్లాలో 16-మెగావాట్ల పాటికారి జల విద్యుత్ ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది. నీటి ప్రవాహం భారీగా వస్తుండటంతో పండూ డ్యామ్ నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్థానికులు, పర్యాటకులు నది ఒడ్డుకు రాకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
అటు, కులులోని 126-మెగావాట్ల లార్జీ జల విద్యుత్ ప్రాజెక్టుకూ నీటి ప్రవాహం బాగా పెరిగింది. భారీ వర్షం కారణంగా మండి జిల్లా మేజిస్ట్రేట్ అపూర్వ్ దేవగన్ ఇవాళ జిల్లాలోని అన్ని పాఠశాలలు, విద్యా సంస్థలను ముందు జాగ్రత్త చర్యగా మూసివేయాలని ఆదేశించడంతో విద్యాసంస్థలు తెరుచుకోలేదు.
సోమవారం నాడు సిమ్లా నగర శివారులో ఐదంతస్తుల భవనం కూలిపోయిన సంగతి తెలిసిందే. అయితే, బిల్డింగ్ లోని వాళ్లందరినీ ముందుగానే ఖాళీ చేయించడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. గత 10 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటం, ఆకస్మిక వరదలు కారణంగా పలువురు మరణించినట్లు చెబుతున్నారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా 259 లింక్ రోడ్లు మూసుకుపోయాయి. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 614 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు పాడైపోగా.. 144 చోట్ల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
ఐఏఎస్ అని చెప్పుకుంటూ దర్జాగా కారులో షికార్లు.. పోలీసులకు చిక్కిన నిందితుడు
అగ్ని-5 బంకర్ బస్టర్ మిసైల్ అభివృద్ధికి నడుం కట్టిన డీఆర్‌డీఓ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి