Gujarat ATS: పాక్‌కు భారత రక్షణ రహస్యాలు చేరవేత.. అరెస్ట్
ABN , Publish Date - May 24 , 2025 | 02:56 PM
భారత రక్షణ రహస్యాలు తెలుసుకోవడానికి పాకిస్థాన్ భారత్‌లో పెద్ద నెట్ వర్కే నడిపినట్టు అర్థమవుతోంది. ఇటీవల ఏటీఎస్ అరెస్ట్ చేసిన గోహిల్ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం భారతదేశంపై పాక్ కుటిల యత్నాలు మరిన్ని బయటకు వస్తున్నాయి.

ఇంటర్నెట్ డెస్క్: భారత సరిహద్దు భద్రతా దళం (BSF) భారత వైమానిక దళం (IAF)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నందుకు ఒక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. దీనికి సంబంధించి గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం (ATS) సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌ను అరెస్టు చేసింది. అరెస్టును ధృవీకరించిన గుజరాత్ ATS కేసు వివరాలను వెల్లడించింది. “గుజరాత్ ATS కచ్‌కు చెందిన మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ అయిన సహ్‌దేవ్ సింగ్ గోహిల్‌ను అరెస్టు చేసింది” అని ఏటీఎస్ ఎస్పీ సిద్ధార్థ్ అన్నారు. “అతను BSF, IAFకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్‌తో పంచుకుంటున్నాడని మాకు సమాచారం ఉంది” అని ఆయన తెలిపారు.
సహ్‌దేవ్ సింగ్ గోహిల్ కచ్‌కు చెందిన ఒక ఆరోగ్య కార్యకర్త. ATS చెబుతున్న వివరాల ప్రకారం, గోహిల్‌ను మే 1న ప్రాథమిక విచారణ కోసం పోలీసులు పిలిచారు. ఈ విచారణలో గోహిల్ 2023 జూన్-జూలై నెలల్లో వాట్సాప్‌లో అదితి భరద్వాజ్ అనే మహిళతో స్నేహం చేసాడని వెల్లడైంది. "ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆమె పాకిస్తానీ ఏజెంట్ అని గోహిల్‌కు తెలిసింది. ఆమె నిర్మాణంలో ఉన్న లేదా కొత్తగా నిర్మిస్తున్న BSF, IAF సైట్‌ల ఫోటోలు, వీడియోలను అడిగింది. దీంతో గోహిల్ వాట్సాప్ (WhatsApp) ద్వారా ఫోటోలు, వీడియోలను షేర్ చేయడం ప్రారంభించాడు" అని గుజరాత్ ATS SP చెప్పారు.
2025 ప్రారంభంలో, గోహిల్ తన ఆధార్ వివరాలను ఉపయోగించి ఒక సిమ్ కార్డును కొనుగోలు చేసి, భరద్వాజ్ వాడుకునేందుకు దానిపై వాట్సాప్‌ను యాక్టివేట్ చేశాడని ఏటీఎస్ పోలీసులు చెబుతున్నారు. పాకిస్తాన్ ఏజెంట్ ఉపయోగిస్తున్న ఆ నంబర్ నుండి BSF, IAF మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయబడ్డాయి. గూఢచర్య నెట్‌వర్క్‌లో భాగమైన ఒక గుర్తు తెలీని వ్యక్తి గోహిల్‌కు రూ.40,000 ఇచ్చాడని కూడా ఏటీఎస్ నిర్ధారించింది. “గోహిల్ ఫోన్ FSLకి పంపించాం. అదితి భరద్వాజ్ పేరుతో ఉన్న వాట్సాప్ నంబర్‌లు పాకిస్తాన్ నుండి పనిచేస్తున్నాయి” అని సిద్ధార్థ్ చెప్పారు. గోహిల్.. ఇంకా సదరు పాకిస్తాన్ ఏజెంట్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 61, 148 కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి:
జూన్ 2025లో బ్యాంకు సెలవులు..ఎప్పుడు, ఎక్కడ బంద్
నేడు 10వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి