Share News

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ

ABN , Publish Date - Mar 02 , 2025 | 10:07 AM

రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. రిజర్వేషన్ చేయించుకున్నా.. మీ బెర్తు లేదా సీట్లో ఇతరులు కూర్చున్నారా.. మీకు తోటి ప్రయాణీకులు విసుగు పుట్టిస్తున్నారా.. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా.. సమస్య ఏదైనా క్షణాల్లో పరిష్కారం ఎలాగో తెలుసుకుందాం.

Indian Railway: జనరల్ టికెట్ ప్రయాణీకులతో రిజర్వేషన్ బోగి నిండిపోయిందా.. ఇలా చేస్తే క్షణాల్లో మీ సమస్యకు పరిష్కారం గ్యారంటీ
Indian Railway

రైలు ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మరికొన్ని సందర్భాల్లో ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతులు ఎదురవుతాయి. అదే సమయంలో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రశాంతమైన ప్రయాణం కోసం ముందుగానే రైలు ప్రయాణం కోసం టికెట్ రిజర్వు చేసుకుంటారు ఎక్కువమంది. తమకు కేటాయించిన బెర్తులో పడుకుని గమ్యస్థానానికి చేరుకోవచ్చనుకుంటారు. కానీ మీరు రిజర్వేషన్ చేయించుకున్న మీ బెర్తు లేదా సీటు వద్దకు వెళ్లేసరికి ఇతర వ్యక్తులు కూర్చుని ఉంటారు. కొన్నిసందర్భాల్లో రిజర్వేషన్ బోగిలో జనరల్ టికెట్ ప్రయాణీకులు ఎక్కువుగా ఎక్కడం ద్వారా మీకు ఇబ్బందికలిగిస్తారు. ఆ సందర్భాల్లో ప్రయాణం విసుగుగా సాగుతుంది. ఏమి చేయాలో తోచదు. ఇబ్బందిపడుతూ ప్రయాణం చేస్తారు. మీ బెర్తు లేదా సీట్లో కూర్చున్న వ్యక్తులను లేవమంటే లేవరు. టీటీఈ ఆ సమయంలో మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమి చేయాలో తెలుసుకుందాం.


ఎలాంటి సమస్యకైనా..

భారతీయ రైల్వే ప్రయాణీకులకు అసౌర్యం కలగకుండా చూసేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది. వీటి గురించి కొంతమందికి తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదురైనప్పుడు సర్దుకుపోతూ ప్రయాణం చేస్తారు. రిజర్వేషన్ బోగీల్లో భద్రతకు భారతీయ రైల్వే ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. జనరల్ టికెట్ ప్రయాణీకులు రిజర్వేషన్ బోగీల్లో ఎక్కితే ఫైన్ విధించడం ద్వారా అలాంటివారిని కట్టడిచేసే ప్రయత్నం చేస్తోంది. ఫైన్ కట్టినప్పటికీ రిజర్వేషన్ ప్రయాణీకుడికి ఏ ఒక్కరూ ఇబ్బంది కలిగించకూడదు. మన బెర్తు లేదా సీటు లేదా బోగీలో సాధారణ టికెట్ ప్రయాణీకులు ఎక్కినప్పుడు ఒక్క ఫిర్యాదుతో సమస్యకు క్షణాల్లో పరిష్కారం లభిస్తుంది. ఇంతకీ ఈ ఫిర్యాదు ఎలా చేయాలనే అనుమానం కలగడం సహజం. గతంలో రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ట్విట్టర్ ఐడీకి ట్వీట్ చేయడం ద్వారా వీలైనంత త్వరగా సమస్యకు పరిష్కారం లభించేది. ట్విట్టర్ వినియోగించే ప్రయాణీకుల సంఖ్య తక్కువుగా ఉండటంతో పాటు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదుల పరిష్కారంలో కొంత జాప్యం ఏర్పడుతుండటంతో భారతీయ రైల్వే ప్రయాణీకుల సమస్యలు, ఇబ్బందులను త్వరితగతిన పరిష్కరించేందుకు మరో సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.


కొత్త పోర్టల్

రైల్ మదద్ పేరుతో రైల్వేశాఖ ఓ పోర్టల్ తీసుకొచ్చింది. ఈ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే గంటలోపు సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా రైలులోని రిజర్వుడు బోగిలో జనరల్ టికెట్ ప్రయాణీకులు లేదా టికెట్ లేని ప్రయాణీకులు ప్రయాణిస్తే వారిని కట్టడిచేసే బాధ్యత రైలులోని టీటీఈ, స్క్వాడ్‌పై ఉంటుంది. కానీ టీటీఈకి టికెట్లు తనిఖీ చేసే పని ఉండటంతో ఆయనపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఆర్పీఎఫ్‌ సిబ్బంది ఈ విధులను నిర్వర్తిస్తారు. రైలు మదద్ పోర్టల్‌లోకి వెళ్లగానే ప్రయాణికుడి ఫోన్ నెంబర్ అడుగుతుంది. నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత టికెట్ పిఎన్‌ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిఎన్‌ఆర్ ఎంటర్ చేయగానే ప్రయాణానికి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. వెంటనే మన ఫిర్యాదును ఎంచుకోవాలి. భద్రతపరమైన అంశం కావడంతో సెక్యూరిటీ ఆప్షన్ ఎంచుకుని ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు కింద డిస్క్రిప్షన్‌లో రాయాలి. ఆ తర్వాత మన ఫిర్యాదును సమర్పిస్తే వెంటనే ఫిర్యాదు సంఖ్య మొబైల్ నెంబర్‌కు వస్తుంది. ఈ ఫిర్యాదు వెంటనే భారతీయ రైల్వేలోని ప్రత్యేక ఫిర్యాదుల విభాగం, సహాయ కేంద్రానికి వెళ్తుంది. వారు ఫిర్యాదు పరిశీలించి ప్రయాణీకుడు ప్రయాణిస్తున్న రైలు ఏ రైల్వేజోన్ పరిధిలో ఉందో చెక్ చేసి వెంటనే సమీపంలోని సంబంధిత అధికారులకు సమస్యను తెలియజేస్తారు. రైల్వే అధికారులు ఆ రైలుకు సంబంధించి డ్యూటీలో ఉన్న సిబ్బందికి విషయాన్ని తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.


ఫిర్యాదుదారుడి ఫీడ్ బ్యాక్..

ఫిర్యాదును పరిష్కరించిన తర్వాత రైల్వే సిబ్బంది ప్రయాణికుడి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. సమస్య పరిష్కారమైందా లేదా, రైల్వే స్పందించిన తీరుపై సంతృప్తిగా ఉన్నారా అనే విషయాలను ఫీడ్ బ్యాక్ ఫామ్‌లో అడుగుతారు. అదే సమయంలో సమస్య పరిష్కరించిన తర్వాత పురోగతిని రైల్వే సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదును క్లోజ్ చేస్తున్నామని భారతీయ రైల్వేనుంచి ప్రయాణికుడి మొబైల్‌ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Mar 02 , 2025 | 10:07 AM